గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జనవరి 2020 (13:34 IST)

రాజధాని అమరావతిపై చాలా వ్యతిరేకత.. ఎందుకో ఆలోచించుకోవాలి : కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పు అంశంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకంత వ్యతిరేకత వస్తుందో ఆలోచించుకోవాలని సూచించారు. తాము 33 జిల్లాలు ఏర్పాటు చేసినా రవ్వంత కూడా వ్యతిరేకత లేదన్నారు. మరి అమరావతి విషయంలో ఎందుకింత వ్యతిరేకత వస్తుందో ఆలోచన చేయాలన్నారు. 
 
మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తెలంగాణలో చాలా జిల్లాల విభజన చేశామని, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాక ఎక్కడా కూడా రవ్వంత వ్యతిరేకత రాలేదన్నారు. ఏపీలో మూడు రాజధానుల అంశంపై మాత్రం ఆందోళనలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. 
 
చాలా వ్యతిరేకత వస్తోందని, ఎందుకనేది ఆలోచించుకోవాల్సి ఉందని చెప్పారు. బీజేపీతో జనసేన పొత్తుపై మీడియా ప్రశ్నించగా, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏం చేస్తే మాకేంటీ? అని ప్రశ్నించారు. ఆ విషయాలన్నింటినీ ఏపీ ప్రజలు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. 
 
అలాగే, తెలంగాణలో బీజేపీ - కాంగ్రెస్ మధ్య సంబంధాలపై కేటీఆర్ స్పందిస్తూ, రాష్ట్రంలో జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీల పొత్తు మరోసారి బయటపడిందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలోనూ రెండుపార్టీలూ కొన్నిచోట్ల ఇలాగే చేశాయని తెలిపారు. మున్సిపోల్స్‌లో టీఆర్‌ఎస్‌ సింహభాగం స్థానాలను దక్కించుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. 
 
బీజేపీ తరపున పోటీచేయడానికి కనీసం అభ్యర్థులు లేరని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్‌ కూడా చాలాస్థానాల్లో అభ్యర్థులను నిలుపలేకపోయిందని అన్నా రు. రెండు జాతీయపార్టీల పరిస్థితి ఒకేలా ఉన్నదని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ అన్నిస్థానాలకు నామినేషన్‌ వేసిందని.. స్థానిక ఎమ్మెల్యేలు బీ ఫారాలు జారీచేశారని తెలిపారు. ఒక్కోస్థానంలో అభ్యర్థుల నుంచి పోటీ ఎక్కువగా ఉండటంతో టికెట్టు దక్కనివారికి సర్దిచెప్పాల్సి వచ్చిందని అన్నారు.