మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 5 జనవరి 2022 (15:40 IST)

కరోనా కంటే జగన్ వైరస్ రాష్ట్రానికి ప్రమాదకరం

క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేసే నాయకులకే పార్టీలో గుర్తింపు ఉంటుంద‌ని, త్వరలో మెంబర్ షిప్ డ్రైవ్ ప్రారంభిస్తామ‌ని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిల సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు.
 
 
ప్రత్యర్థులపై మనం చేస్తున్నది రాజకీ యుద్ధమే త‌ప్ప భౌతిక యుద్ధం కాద‌ని, ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చి, ఎండగట్టాల్సిన బాధ్యత ఉందని చంద్ర‌బాబు పేర్కొన్నారు. మార్చి 29నాటికి పార్టీ ప్రారంభించి 40 సంవత్సరాలు అవుతుంద‌ని, ఆ తర్వాత మహానాడు ఉంటుంద‌న్నారు. మే 28న దివంగతనేత ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించాల్సి ఉంద‌న్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా  సోషల్ మీడియాపై కూడా దృష్టి సారించాల‌ని, కమ్యూనికేషన్ లో వస్తున్న‌ మార్పులకు అనుగుణంగా పంథా మారాల‌ని చంద్ర‌బాబు సూచించారు. 
 
 
జగన్ రెడ్డి పాలన 32 నెలలు గడిచింద‌ని, రాష్ట్రానికి వైసీపీ గ్రహణం పట్టింద‌ని, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించార‌ని, విధ్వంసం చేశార‌ని విమ‌ర్శించారు. ఎవరైనా మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారు. టీడీపీని నిర్వీర్యం చేయాలనే కుట్ర పన్నారు. ఒక పక్క బాధ, మరోపక్క ఆవేదన ఉంది. ఇక్కడ ఈ వేదికపై ఉన్న నాయకులందరిపై అక్రమ కేసులు ఉన్నాయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన, భూములు దానం చేసిన అశోక్ గజపతిరాజుపైనా అక్రమ కేసులు పెట్టారు. ఆయన ఎక్కడా ఒక్క పైసా అవినీతికి పాల్పడలేదు. రామతీర్థంలో ధర్మకర్త పేరే లేదు. ఎందుకు లేదు అని ప్రశ్నిస్తే కేసు పెట్టారు. శాసనసభ జరిగే పరిస్థితి లేదు. జరిగినా ప్రజాసమస్యలపై చర్చించకుండా ప్రత్యర్థులపై బూతులతో ఎదురుదాడికి దిగుతూ చట్టసభల గౌరవాన్ని మంటగలుపుతున్నారు. శాసనమండలి ఛైర్మన్ గా ఉన్నప్పుడు షరీఫ్ పట్ల ఏవిధంగా వ్యవహరించారో చూశాం. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. అడ్డగోలు నిర్ణయాలపై తీర్పులిచ్చిన న్యాయ వ్యవస్థపైనా దాడికి దిగార‌న్నారు. 
 
 
చాలా మంది ముఖ్యమంత్రులను చూశా. ఇంత పనికిమాలిన, మూర్ఖపు ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నా. రాష్ట్ర విభజన కంటే జగన్ రెడ్డి చేసిన నష్టం ఎక్కువ. కోలుకోవడానికి చాలా ఏళ్లు పడుతుంది. రూ.22,945 కోట్ల రెవెన్యూ లోటుతో రాష్ట్రం ఏర్పడింది. 2014-19 మధ్య టీడీపీ సుపరిపాలన అందించింది. టీడీపీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఎవరూ అమలు చేయలేదు. అయిదేళ్లలో ఎప్పుడూ పన్నులు పెంచలేదు. ఇరిగేషన్ కు రూ.64వేల కోట్లు ఖర్చు చేశాం. అమరావతి ద్వారా రాష్ట్రానికి రూ.2లక్షల కోట్ల సంపద వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ పనులను చిత్తశుద్ధితో చేపట్టి 70శాతానికి పైగా పూర్తిచేశాం  కియా, హీరో మోటార్స్ వంటివి వచ్చాయి. 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు జరిగాయి. నేడు ఒక్క పరిశ్రమ రావడం లేదు. అప్పు మాత్రం రూ.7 లక్షల కోట్లకు చేరింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
 
 
జగన్ రెడ్డి అరాచకాన్ని ఎదుర్కోవాలంటే అందరం కలిసి ఉద్యమించాలి. ఆర్యవైశ్యులు సమావేశం పెట్టుకుని జగన్ రెడ్డి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అనే పరిస్థితి వచ్చింది. అటువంటి వారికి టీడీపీ మద్దతుగా నిలవాలి. వైసీపీ నేతల అవినీతిని, స్థానికంగా జరుగుతున్న అరాచకాల్ని ఎక్కడికక్కడ ఎండగట్టాల‌ని బాబు సూచించారు.