గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (12:40 IST)

రంగుల భారం

గ్రామ సచివాలయాల్లో రంగుల భారంతో కార్యదర్శులు సతమతమవుతున్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయ భవనాలకు రంగులు వేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో నిధులు అంతంతమాత్రంగానే ఉన్నా యుద్ధప్రాతిపదికన లక్ష్యాన్ని పూర్తి చేశారు.

ఇందుకు సంబంధించిన బిల్లులు పూర్తి స్థాయిలో చెల్లించకముందే వేసిన రంగులు తొలగించాలంటూ వచ్చిన ఆదేశాలతో కార్యదర్శుల్లో కలవరం మొదలయ్యింది. అధికారిక ఆదేశాలతో రంగుల పని పూర్తి చేసేందుకు నానా తంటాలు పడిన కార్యదర్శులకు ఇప్పడు వాటిని తొలగించే పని తలకుమించిన భారంగా మారింది.

ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీల జెండాలకు సంబంధించిన రంగులు ఉండకూదని, తక్షణం తొలగించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్ధానం ఆదేశించడంతో ఖర్చు చేసిన రూ. కోట్ల ప్రజాధనం ఎందుకూ కొరగాకుండా పోయినట్టయ్యింది.
 
గడచిన అక్టోబరు నుంచి ప్రారంభమైన సచివాలయ కార్యాలయాలకు వైకాపా జెండాలో ఉన్న రంగులు వేయాలంటూ అధికారులు సచివాలయ కార్యదర్శులకు స్పష్టం చేశారు. రంగుల నిమిత్తం సచివాలయాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయలేదు.

సకాలంలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించని నేపథ్యంలో గడచిన ఆగస్టు నుంచి కేంద్ర ఆర్థిక సంఘ నిధుల మంజూరు నిలిచిపోయింది. పంచాయతీల ఆర్థిక పరిపుష్ఠిలో కీలకమైన ఆర్థిక సంఘ నిధులు అందకపోవడంతో అత్యధిక శాతం పంచాయతీల్లో పరిపాలన కుంటుపడింది.

పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, విద్యుత్తు బిల్లులు చెల్లించేందుకు కూడా ఖజానాల్లో చిల్లిగవ్వ లేని పంచాయతీల్లో కార్యదర్శులే పుట్టినచోటల్లా అప్పులు చేసి పరిపాలన నెట్టుకొస్తున్నారు. అసలే ఆర్థిక వెతలతో సతమతమవుతున్న పంచాయతీలకు కొన్ని ప్రభుత్వ పరమైన కార్యక్రమాల నిర్వహణ వ్యయం కూడా తోడవుతూవస్తోంది.

ఈ పరిస్థితుల్లో అన్ని సచివాలయ భవనాలకు రంగులు వేయాలంటూ ఆదేశాలు వెలువడటంతో కార్యదర్శుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారయ్యింది. జిల్లాలో దాదాపు 630 సచివాలయాలు సొంత భవనాల్లో నడుస్తున్నాయి. సాధారణ ఆదాయం ఎక్కువగా ఉండే అతికొద్ది సచివాలయాల్లో మినహా మిగిలిన వాటిలో నిధులు లేకపోయినా కార్యదర్శులే భారం భరించి రంగుల పని పూర్తయ్యేలా చూశారు.

వేసే రంగులు కూడా నాణ్యమైనవిగా ఉండాలని స్పష్టం చేయడంతో సగటున ఒక్కో కార్యాలయానికి రూ.80 వేల వరకూ ఖర్చుచేశారు. జిల్లా మొత్తం మీద రమారమి రూ.5 కోట్ల వరకూ రంగుల పని కోసం వెచ్చించారు. కొన్నిచోట్ల అధికారపార్టీకి చెందిన నాయకులే గుత్తేదారులుగా మారడంతో పనిపూర్తి చేసిన వెంటనే బిల్లుల కోసం కార్యదర్శులపై ఒత్తిడి తీసుకువచ్చారు.

ఎలాగొలా కొన్ని చోట్ల బిల్లులు చెల్లించగా ఇంకా కొన్ని పంచాయతీల్లో బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ ఇబ్బందులు సమసిపోకముందే సచివాలయాల తరహాలోనే అన్ని రక్షిత పథకాలకు రంగులు వేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. డిసెంబరు నెలాఖరులోపు రంగుల కార్యక్రమాన్ని పూర్తిచేయాలంటూ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

జిల్లాలో సీపీడబ్ల్యూ స్కీమ్‌లు మినహాయించి రమారమి 2,292 మంచినీటి పథకాలు ఉన్నాయి. సగటున రూ.లక్ష అంచనా వ్యయంతో రక్షిత పథకాలకు రంగుల పనులు మొదలు పెట్టారు. చాలా సచివాలయాల్లో వీటికి బిల్లులు చెల్లించేందుకు ఏంచేయాలో తెలియక కార్యదర్శులు సతమతమవుతున్నారు.

అనుకోకుండా వచ్చి పడిన ఈ కార్యక్రమానికి బిల్లుల చెల్లింపులే కారణంగా చాలా సచివాలయాల్లో ఒప్పంద కార్మికులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.
 
కలవరంలో కార్యదర్శులు
ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా జెండాకు ఉన్న రంగులు వేయడాన్ని ప్రశ్నిస్తూ కొందరు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, స్పందించిన న్యాయస్థానం పక్షం రోజుల్లో వాటిని పూర్తిగా తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేయడం తెలిసిన విషయమే.

రంగులు వేసేందుకు నానా అవస్థలు పడిన కార్యదర్శులు న్యాయస్థాన ఆదేశాలకు అనుగుణంగా వాటిని తొలగించాలన్న దాదాపు మళ్లీ అంతే భారాన్ని భరించాల్సి వస్తోంది. సచివాలయ కార్యాలయాలతో పాటు రక్షిత పథకాలూ రంగులు వేసిన వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది.

గ్రామాల్లో మౌలిక వసతుల కోసం ఖర్చుచేయాల్సిన నిధులను రంగులపాల్జేస్తే భవిష్య అవసరాల పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది. సహజ నిబంధనలకు విరుద్ధంగా రంగుల అలంకరణ కోసం చేసిన ఖర్చులపై ఆడిట్‌ అభ్యంతరాలు వ్యక్తమైతే తమ పరిస్థితి ఏంటన్న భయం వారిని వెన్నాడుతోంది. ఏ ఇద్దరు కార్యదర్శులు కలిసినా రంగుల అంశమే చర్చకు వస్తోంది.