శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (10:09 IST)

ఆంధ్రప్రదేశ్ లో 'టోరె' పరిశ్రమ

రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చేందుకు త్వరలో రాష్ట్రంలో నూతన పారిశ్రామిక పాలసీ తీసుకువస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యం, నైపుణ్య శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు.

శ్రీసిటీలోని జపాన్ కు చెందిన ప్రముఖ టోరె ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ టోరే ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమను మంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ కొజిరో యుచియమ, టోరే ఇండస్ట్రీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మిట్సు ఒహయో, టోరే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ షిగెకజు సునగా, తిరుపతి పార్లమెంట్ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్, సత్యవేడు శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం, సూళ్ళూరుపేట శాసనసభ్యుడు కిలివేటి సంజీవయ్య, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
నూతన పారిశ్రామిక పాలసీలో నైపుణ్య శిక్షణాభివృద్దికి పెద్దపీట వేస్తామని మంత్రి తెలిపారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం, దానికి అనుబంధంగా పలు కళాశాలలను ప్రారంభించడం ద్వారా నాణ్యమైన శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చాలా ఆసక్తిగా ఉందన్నారు.

శ్రీసిటీ యాజమాన్యం కోరిక మేరకు శ్రీసిటీ నుంచే ఈ పాలసీని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.  1000 కోట్లతో ఏర్పాటైన టోరె పరిశ్రమ, రాష్ట్రంలో పారిశ్రామిక స్థిరత్వాన్ని సూచిస్తోందన్నారు.

ఇంజనీరింగ్ ఫ్యాబ్రిక్స్ మరియు టెక్సటైల్స్ తయారుచేసే ఈ తరహా పరిశ్రమ దేశంలోనే ఇదే మొదటిదని ఆయన తెలిపారు. స్నేహపూర్వక పారిశ్రామిక విధానం వలన పలు జపనీస్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు, ప్రత్యేకించి శ్రీసిటీకి రావడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు. 

జపాన్ పరిశ్రమల కోసం ప్రత్యేక సింగిల్ డెస్క్ విధానాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తమ కంపెనీ ఏర్పాటుకు రాష్ట్రాన్ని ఎంచుకోవడం పట్ల టోరే యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నుంచి అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తామన్నారు.

29 దేశాలకు చెందిన 187 పరిశ్రమలతో 50 వేలకు పైగా ఉపాధి కల్పించి, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతున్న శ్రీసిటీ యాజమాన్యాన్ని మంత్రి గౌతమ్ రెడ్డి అభినందించారు. 
 
టోరె తన వినూత్న ఉత్పత్తులతో భారత మార్కెట్లో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని జపాన్ కాన్సుల్ జనరల్ కొజిరో ఉచియామా అన్నారు.
 
మిత్సువో ఓహ్యా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి ప్లాంట్‌ను ప్రారంభించిన టోరె ఇండస్ట్రీస్‌కు ఇది చారిత్రాత్మక రోజు అన్నారు. యూనిట్  వేగవంతమైన ఆరంభానికి అద్భుతమైన మద్దతు, సహాయ సహకారాలు అందించిన ఏపీ ప్రభుత్వానికి, శ్రీసిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. 
 
షిగెకాజు సునాగా మాట్లాడుతూ, 2011 నుండి భారతదేశంలో టోరె కార్యకలాపాలను, అభివృద్ధిని పవర్పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. 
 
టోరె ప్రారంభోత్సవం కోసం శ్రీసిటీకి తొలిసారి విచ్చేసిన మంత్రికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, యువ డైనమిక్ ముఖ్యమంత్రి, పరిశ్రమల మంత్రి పారిశ్రామిక అభివృద్ధికి చూపుతున్న చొరవను ప్రశంసించారు.
 
 పెట్టుబడులు ఆకర్షించేందుకు, పారిశ్రామిక అభివృద్ధికి వీరు త్వరలో రానున్న నూతన పారిశ్రామిక విధానం అద్భుతమైన ఫలితాలు తెస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన పాలసీని శ్రీసిటీ నుంచే ప్రారంభించాలని మంత్రిని కోరారు.  
 
కాగా, శ్రీసిటీలో 85 ఎకరాలలో, సుమారు రూ.1000 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఫాక్టరీలో రెండు ఉత్పత్తి  కేంద్రాలుంటాయి. ఒక దానిలో వ్యక్తిగతపరిశుభ్రతకు వాడే డైపర్ల తయారీకి అవసరమైన పాలీ ప్రొపిలిన్ ఫైబర్ వస్త్రం (Technical textile) తయారవుతుంది. 
 
రెండవ ఉత్పత్తి కేంద్రంలో ఆటొమొబైల్ రంగంలో ఉపయోగించే విద్యుత్ ఉపకరణాలకు అవసరమైన ఎలాస్టిక్ రెజిన్ పదార్థాన్ని తయారు చేస్తారు. సుమారు 750 మందికి తద్వారా ఉపాధి లభిస్తుంది.

శ్రీసిటీలో ఇప్పటికే 19 జపాన్ పరిశ్రమలు కొలువుతీరి ఉండగా, టోరే 20వ జపాన్ పరిశ్రమ. ఫైబర్ టెక్స్‌టైల్స్, కార్బన్ ఫైబర్, లైఫ్ సైన్స్, రసాయన, పర్యావరణం, ఇంజనీరింగ్ రంగాల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ వ్యాపార  సంస్థ టోరె గ్రూప్ 2011లో భారత్‌లో,  టోరే  ఇండస్ట్రీస్ (ఇండియా) పేరుతో అడుగు పెట్టింది.

తొలుత గుర్గాంలో తన ప్రధాన కార్యాలయాన్ని, ముంబాయిలో వాణిజ్య కార్యాలయాన్ని  స్థాపించింది. వ్యాపార విస్తరణలో  భాగంగా 2016లో గుజరాత్ లోని వాపిలో మోటర్ వాహనాల్లో వాడే ప్రత్యేక ఫైబర్ వస్త్రంతో చేసే 'ఎయిర్ బ్యాగుల' ఉత్పత్తి సంస్థను స్థాపించింది.