1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (18:24 IST)

విపత్తుల వలన ఆస్తులపై తీవ్ర ప్రభావం.. డా.మోహన్ కందా

ప్రధానమంత్రి అధ్యక్షతన 2016 జూన్ లో జాతీయస్థాయిలో విపత్తుల నివారణ కోసం ప్రణాళికలను రూపొందించడం జరిగిందని మాజీ ప్రధాన కార్యదర్శి, పూర్వపు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సభ్యులు డా.మోహన్ కందా పేర్కొన్నారు.

శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని ఐదవబ్లాక్ లో విపత్తుల సమయంలో ప్రమాదాలను నివారించడం ఎలా  అనే అంశంపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ  ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కార్యశాల నిర్వహించారు.

ఈ సందర్భంగా డా.మోహన్ కందా మాట్లాడుతూ, మనం ఎలా ఆలోచిస్తామో ఫలితాలు కూడా అందుకనుగుణంగానే ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. విపత్తులను ఎదుర్కొనేందుకు చేపట్టే కార్యాచరణ ప్రణాళికల ఆలోచన అమలు విధానంపై పై విధంగా ఆయన స్పందించారు.

విపత్తుల వలన సమాజంలో ప్రజా జీవనం, ఆస్తులపై తీవ్ర ప్రభావం చూపే సంఘటనగా పేర్కొనవచ్చని డా. మోహన్ కందా అన్నారు. క్షేత్రస్థాయిలో ముఖ్యంగా విపత్తులను ఎదుర్కొనే ప్రాంతాలను గుర్తించి నివారణకు బాధిత ప్రజలు తమంతట తాముగా ఎదుర్కోగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరముందన్నారు.

విపత్తుల వలన మానవ నష్టం, ఆస్తి నష్టం, పర్యావరణం కూడా  నష్టాలు చవిచూడాల్సి ఉంటుందన్నారు. విపత్తులు సహజమైనవని అవి  వరదలు, తుఫానులు, భూకంపాలు, కొండచరియలు మొదలైనవి ఆయా ప్రాంతాల్లోని భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా విపత్తులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

భౌగోళికంగా ఎదుర్కొనే విపత్తులు ఒక విధంగా ఉంటే మానవుల తప్పిదాల ద్వారా ఏర్పడే విపత్తులు మానవ విపత్తులుగా పరిగణించవచ్చని అవి అసాంఘీక శక్తుల అల్లర్లు, ఉగ్రవాదుల దాడులు, బాంబు పేలుళ్లు, రసాయన, జీవ రేడియోలాజికల్ మరియు అణు ప్రమాదాలు మొదలైనవిగా పేర్కొనవచ్చన్నారు.  
                                   
విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జాతీయస్థాయిలో పథక రచన చేసి వాటిని రాష్ట్రాలలో ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఏపీ హెచ్ఆర్డీఏ డైరెక్టర్ జనరల్ డి.చక్రపాణి అన్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన పెంచడంతో పాటు శాఖల మధ్య సమన్వయం చాలా ముఖ్యమన్నారు.  విపత్తులను ఎదుర్కొనే కంటే వాటి ప్రభావాన్ని తగ్గించేందుకే చొరవ చూపాలని ఆయన సూచించారు. 
 
1992 - 2012 మధ్య 4.4 బిలియన్ ల ప్రజలు ప్రభావితమయ్యారని తద్వారా  2.0 ట్రిలియన్ డాలర్ల నష్టం (యూస్ డీ)  వాటిల్లినట్లు ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ నివేదిక తన నివేదికలో తెలిపిందన్నారు. ఆసియా ప్రాంతంలోనే 2030 వరకు సంవత్సరానికి 71.7 ట్రిలియన్ డాలర్లను మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడి పెట్టడం ద్వారా నష్టనివారణ చర్యలను చేపట్టగలుగుతామన్నారు.

1993వ సంవత్సరంలో ఇండియాలోని లాథూర్ లో రెక్టార్ స్కేల్ పై 6.4 తీవ్రతతో ఏర్పడిన భూకంపం వల్ల  సుమారు 8వేల మంది ప్రాణాలు కోల్పోగా అంతకంటే తీవ్రస్థాయిలో 1994లో అమెరికాలోని కాలిఫోర్నియాలో 6.7 తీవ్రతతతో భూకంపం సంభవిస్తే అక్కడ కేవలం 60 మంది మాత్రమే చనిపోయారని తెలిపారు.

అదే 2003లో ఇరాన్ లోని బామ్ లో 6.7 తీవ్రతతో భూకంపం సంభవిస్తే 40వేల మంది ప్రాణాలొదలగా, 2010లో యూఎస్ఏలోని కాలిఫోర్నియాలో 6.5 తీవ్రతతో భూకంపం రాగా ప్రాణనష్టం సంభవించకుండా సమర్థవంతమైన నిర్వహణ చర్యలు చేపట్టగలిగారన్నారు.

తరుచుగా జపాన్ లో భూకంపాలు సంభవిస్తున్నా అక్కడ ప్రాణనష్టం స్వల్ప స్థాయిలోనే ఉందంటే అక్కడ చేపడుతున్న సమర్థవంతమైన నివారణ చర్యలే కారణమన్నారు. వాటి నుంచి మనం చాలా నేర్చుకోవాలని ఆయన సూచించారు. అదే విధంగా ఇటీవల ప్రపంచ స్థాయిలో ప్రకృతి విపత్తుల సమయంలో జరిగే విపత్తుల నష్టాన్ని గణనీయంగా తగ్గించగలగడం గమనార్హం అన్నారు.

భూకంపాల బారిన పడ్డా కూడా ప్రాణ నష్టం అధికశాతం సంభవించకుండా యూఎస్ఏ, జపాన్ లాంటి దేశాల్లో చేపట్టిన చర్యలు ఆచరణీయంగా నిలుస్తున్నాయన్నారు. గత సంఘటనలను పరిగణలోకి తీసుకుంటే ఆర్థికంగా దెబ్బతిన్న సంఘటలను చవిచూడటం జరిగిందన్నారు. వాటి నుండి అనుభవపాఠాలు నేర్చుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను ఎవరికి వారే రూపొందించుకోవాలన్నారు.

ఇందుకోసం జాతీయస్థాయిలో రూపొందించిన మార్గదర్శకాలను కూడా అధ్యయనం చేయాలని వక్తలు సూచించారు. 2009లో ఏపీలోని 5జిల్లాలు వరదలు సంభవిస్తే 12వేల కోట్ల నష్టం సంభవించిందని నివేదికలు పేర్కొన్నాయన్నారు. అదే విధంగా  2012లో నీలమ్ తుఫాను సందర్భంగా 30 మంది మరణించగా 7 లక్షల హెక్టార్లలో కేవలం 1710 కోట్ల పంట నష్టానికి తగ్గించగలిగామన్నారు.

2014లో హుద్ హుద్ తుఫాన్ వచ్చిన సందర్భంలో ఉభయగోదావరి, ఉత్తరాంద్ర ప్రాంతాలు భారీగా దెబ్బతిన్నాయి. సుమారు 21,908 కోట్ల నష్టం సంభవించిందన్నారు.2018 తిత్లీ సందర్భంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సుమారు నష్టాన్ని 400 కోట్లకు తగ్గించామన్నారు.

విపత్తు నిర్వహణలో  “రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ప్రస్తుత స్థితి మరియు సవాళ్ళు” అనే అంశంపై మధ్యప్రదేశ్ విపత్తూ నిర్వహణసంస్ధ సంచాలకులు డా. రాకేష్ దూబే కార్యశాలలో ప్రసంగించారు. కార్యశాలలో యూనిసెఫ్ హైదరాబాద్ డిఆర్ఆర్ అధికారి మహేంద్ర రాజారాం, మధ్య ప్రదేశ్ డిఎమ్ఐ సంచాలకులు డా.రాకేష్ దూబే, ఫైర్ సర్వీసెస్ డిజి అనురాధ, 13 జిల్లాలకు  చెందిన సమన్వయ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.