శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 29 జులై 2020 (14:50 IST)

ఏపీలో రహదారుల అభివృద్ధే ప్రధాన లక్ష్యం: రహదారులు,భవనాల శాఖా మంత్రి

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రహదారులు-భవనాల శాఖా మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ అన్నారు. సచివాలయంలోని 4వ బ్లాక్ లో రహాదారులు-భవనాల శాఖ కార్యాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్ లో ఆశాఖ మంత్రిగా శంకర నారాయణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

అంతకు ముందు మంత్రి శంకర నారాయణ దంపతులకు నాల్గొ బ్లాక్ ముఖ ద్వారం వద్ద పూర్ణ కుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి తనకు కేటాయించిన ఛాంబర్లో మంత్రి సాంప్రదాయ పూజలు నిర్వహించారు. అనంతరం రహదారులు-భవనాల శాఖ మంత్రిగా శంకర నారాయణ బాధ్యతలు స్వీకరించారు.

గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు వేసేందుకు గాను రూ.6400 కోట్లతో  మూడు వేల కిలోమీటర్ల  రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ డి బి(న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్) తో చేసుకున్న ఒప్పందం పై  మంత్రి తొలి సంతకం చేశారు.

తూర్పు గోదావరి జిల్లాలో అప్పటి ప్రతిపక్ష నేతగా జగన్ ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న క్రమంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న వృద్ధ గౌతమి వంతెన నిర్మాణ పనులకు సంబంధించి రూ.76.90 కోట్ల పరిపాలన అనుమతులపై మంత్రి రెండో సంతకం చేశారు.
 
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ అండ్ బి శాఖ మంత్రిగా బాధ్యతలను తీసుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా వుందని అన్నారు. సిఎం జగన్ తనకు ఆర్ అండ్ బి శాఖ‌ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు.మొదటి సారిగా గెలిచిన తనకు గతంలో  బిసి సంక్షేమ శాఖ మంత్రిగా చేసే అవకాశం కల్పించినందకు ధన్యవాదలు తెలిపారు.‌

రాష్ట్ర ప్రభుత్వంలో  కీలక మంత్రిత్వ శాఖలు‌ ఎస్సీ ఎస్టీ బలహీన, మైనారిటీ వర్గాలకు సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.ఆ నాటి వైయస్ ఆర్ దగ్గర నుంచే నేటి సిఎం జగన్మోహన్ రెడ్డి వరకు పేదలను ఆదరించి,అభివృద్ధి చేసే గుణం కలిగిఉన్నవారని గుర్తు చేశారు..తనపై నమ్మకం ఉంచి మంత్రిగా అవకాశం కల్పించిన నేపథ్యంలో,తన బాధ్యతలను సమర్ధ వంతంగా నిర్వహించి,సిఎం జగన్ కు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు వస్తానని వెల్లడించారు.

కార్యక్రమంలో రహదారులు-భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి టి.కృష్ణబాబు,రాష్ట్ర గ్రామీణ రహదారుల చీఫ్ ఇంజనీరింగ్ అధికారి వేణుగోపాల రెడ్డి,రాష్ట్ర రహదారులు-భవనాలశాఖ చీఫ్ ఇంజనీర్ నియీముల్లా,నేషనల్ హైవేస్ చీఫ్ ఇంజనీర్ రామచంద్ర,రాష్ట్ర రహదారులు- భవనాలశాఖ కార్పోరేషన్ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.