గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 22 జులై 2021 (11:28 IST)

గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌కు ర‌థ‌సార‌ధులు స‌ర్పంచులే

రాష్ట్ర ప్ర‌భుత్వం వినూత్నంగా ప్రారంభించిన గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌కు ర‌థ‌సార‌ధులు స‌ర్పంచులే అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చెప్పారు. మ‌హాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నార‌ని అన్నారు.

ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఇంజనీరింగ్ కళాశాల అవరణలో గ్రామ పంచాయతీ సర్పంచుల‌కు శిక్షణ తరగతులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రారంభించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదుతో క‌లిసి మంత్రి ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచుల‌ను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, గ్రామ స్దాయి నుంచి పరిపాలన పై అవగాహన  ఉన్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. సీఎం జ‌గ‌న్ ముందు చూపుతో ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా  750 రకాల సేవలు ప్రజలకు అందిస్తున్నట్లు వివ‌రించారు. 
 
పంచాయతీరాజ్ శాఖ ముద్రించిన స‌ర్పంచుల శిక్షణ కరదీపిక ను మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు వ‌సంత కృష్ణ ప్ర‌సాద్, సామినేని ఉద‌య భాను, కృష్ణ క‌లెక్ట‌ర్ జె.నివాస్ విడుదల చేశారు. పంచాయతీ రాజ్ డైరెక్టర్ మురళి, జడ్పీ సిఇఓ  సూర్య ప్రకాష్, డిపీఓ జ్వోతి త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
ఈ సంద‌ర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ, జిల్లాలో నాలుగు డివిజనల్లో బ్యాచ్ ల వారీగా 778 సర్పంచ్ లకు మూడేసి రోజులపాటు ఆగస్టు 7  వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ, గ్రామ స్దాయి నుంచి రాష్ట్ర స్దాయికి ఎదిగిన నాయకులను నేటి తరం సర్పంచ్ లు ఆదర్శంగా  తీసుకోవాలని సూచించారు.

గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ది సంక్షేమ పథకాల అమలు భాధ్యత గ్రామ సర్పంచ్ లదే ఆని తెలిపారు. ప్రభుత్వ విప్ సామినేని ఉధయభాను గారు మాట్లాడుతూ, కోవిడ్ కష్టకాలంలో కూడ నిరంతరం అభివృద్ది సంక్షేమ పథకాల అమలు చేస్తున్న నాయకులు జగన్మోహనరెడ్డి అని తెలిపారు. గ్రామ సచివాలయను ఏర్పాటుచేసి ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చినట్లు తెలిపారు.