బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 15 మార్చి 2020 (10:41 IST)

వివేకా హత్యకు ఏడాది పూర్తి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురై నేటితో ఏడాది పూర్తయింది. కానీ ఇంతవరకూ దోషుల్ని పట్టుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివేకా హత్య జరిగిన వెంటనే దర్యాప్తు కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ‘సిట్‌’ను నియమించారు.

అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత సీఎం జగన్‌ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఆయన స్వయంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ‘సీబీఐ’ సంగతి పక్కనపెట్టారు.

వివేకానంద రెడ్డి ‘గుండెపోటు’తో మరణించారని తొలుత ప్రచారం చేయడం... రక్తపు మరకలను తుడిచేయడం, కుటుంబ సభ్యులు రాకమునుపే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడం వంటి అనేక ‘అనుమానాస్పద’ చర్యలతో ఈ కేసు పెను సంచలనం సృష్టించింది. సిట్‌ దర్యాప్తు ఇప్పటికి ముగ్గురు ఎస్పీల ఆధ్వర్యంలో సాగింది. తొలుత అప్పటి సీఎం చంద్రబాబు నాటి కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ నేతృత్వంలో దర్యాప్తు కోసం సిట్‌ను నియమించారు.

వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక కడప ఎస్పీగా అభిషేక్‌ మహంతిని నియమించారు. ఆయన నేతృత్వంలో సిట్‌ దర్యాప్తు కొనసాగింది. దాదాపుగా విచారణ ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో అభిషేక్‌ మహంతి దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.

గత ఏడాది అక్టోబరు 11న కడప ఎస్పీగా కేకేఎన్‌ అన్బురాజన్‌ను నియమించారు. ఆయన నేతృత్వంలో మూడో సిట్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన సారథ్యంలోనే దర్యాప్తు కొనసాగుతోంది.  నెలలు గడుస్తున్నా కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు.
 
సిట్‌ దర్యాప్తు చేస్తున్న అధికారులను మార్చారని, కడపకు కొత్త ఎస్పీ వచ్చిన తరువాత దర్యాప్తు నత్తనడకన సాగుతోందని వెల్లడించారు. ‘అమాయకులను ఇరికించి అసలైన  నేరస్తులను వదిలేస్తారేమో?’ అనే సందేహం వెలిబుచ్చారు. ‘వీరిపై అనుమానాలున్నాయి’ అంటూ పలువురి పేర్లు, వారిపై ఉన్న అనుమానాలను కూడా హైకోర్టుకు వివరించారు.

కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి కూడా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆయా ఫిర్యాదులను విచారించిన న్యాయస్థానం ఈ నెల 11న సీబీఐకి కేసును అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
 
విజయమ్మ నివాళి
దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెంది ఏడాది అయింది. ఈ సందర్భంగా పులివెందులలోని ఆయన సమాధికి వైఎస్ విజయమ్మ, ఎంపీ అవినాష్ రెడ్డి, ఇతర కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఆయనను గుర్తు చేసుకుని ప్రత్యేక పార్థనలు చేశారు.