గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2019 (20:08 IST)

సివిల్ సర్వీసెస్ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు: కృష్ణా జిల్లా కలెక్టర్‌

విజయవాడలో ఈ నెల 20 నుండి 29వ తేదీ వరకు జరగనున్న సివిల్ సర్వీసెస్ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ .ఎండి.ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు.

స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో గురువారం సివిల్ సర్వీసెస్ పరీక్షల నిర్వహణపై అధికార్లతో కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఈ నెల 20, 21, 22, 28 మరియు 29 వ తేదీలలో విజయవాడలో జరుగుతాయన్నారు. విజయవాడ మాచవరంలోని యస్ఆర్ ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, వాటిలో ఒక కేంద్రాన్ని విభిన్న ప్రతిభావంతులకు కేటాయించామన్నారు.

పరీక్షా కేంద్రంలోనికి సెల్ ఫోన్ తో పాటు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరని, వాటిని భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టరు ఆదేశించారు.

పరీక్షల నిర్వహణకు జిల్లా రెవెన్యూ అధికారిని అసిస్టెంట్ కోఆర్డినేటింగ్ సూపర్ వైజరుగాను , విజయవాడ సబ్ కలెక్టరును లోకల్ ఇన్ స్పెక్టింగ్ అధికారిగాను , విజయవాడ నార్త్, ఈస్ట్ తాహశీల్దార్లను లైజన్ అధికార్లుగా నియమించడం జరిగిందన్నారు.

వీరితోపాటు ముగ్గురు జిల్లా అధికారులను అసిస్టెంట్ సూపర్ వైజర్లుగా నియమించడం జరిగిందన్నారు. పరీక్షల నిర్వహణకు 14 మంది ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందన్నారు. పరీక్షా పత్రాలకు పటిష్టమైన భద్రత కల్పించాలని పోలీసు అధికారులను కలెక్టరు ఆదేశించారు.

పరీక్ష హాలు ఆవరణలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేయాలన్నారు. అభ్యర్థుల సౌక్యార్ధం ఈ నెల 20వ తేదీన ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా జాయింటు కలెక్టరు కె.మాధవీలత, డిఆర్ఒ ఏ.ప్రసాద్, జిల్లా పంచాయితీ అధికారి కె.అరుణ, జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి మూర్తి, ఇన్‌ఛార్జి సబ్-కలెక్టరు చక్రపాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.