ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2019 (19:50 IST)

జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో మరింత తోడ్పాటు... సీఎస్

దేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికులకు అమలుచేస్తున్న ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో మిగతా రాష్ట్రాలకంటే ముందుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకంపై గురువారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ పథకం అమలుకు ఉన్న గడువును జూన్ నుండి నవంబరు వరకు పెంచినందుకు రాష్ట్రం తరుపున కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

దేశంలో అత్యధికంగా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనను సద్వినియోగం చేసుకుంటున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయిన నేప‌ధ్యంలో ఈ పథకంలో రాష్ట్రానికి మరింత తోడ్పాటును అందించి ప్రోత్సహించాలని కేబినెట్ కార్యదర్శికి సీఎస్ విజ్ణప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వం 2017 నుండి మూడు సామాజిక భద్రత పథకాలైన పిఎంజెజెవై, ఏఏవై, పిఎంఎస్బివై పథకాలను కన్వర్జెన్స్ విధానంలో ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజనగా అమలు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పథకాన్ని అత్యధికంగా వినియోగించుకోవడం జరుగుతోందని వివరించారు. గత జూన్ నెలాఖారుకు ముగిసిన గడువున ఈ ఏడాది నవంబరు నెలాఖరు వరకూ పొడిగించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ణతలు తెలిపారు.

ఈ ఏడాది జూన్ 1నుండి వచ్చే ఏడాది మే 31 వరకూ ఈ పథకం అమలుకుగాను రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.400 కోట్ల ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వం జీవిత బీమా సంస్థ(ఎల్ఐసి)కి చెల్లించడం జరిగిందని తెలిపారు. ఈ క్ర‌మంలో పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత తోడ్పాటును అందించి పెద్దఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం కేబినెట్ కార్యదర్శికి విజ్ణప్తి చేశారు. 

కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వీడియో సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం వినియోగించుకోని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజనన సమర్ధవంతంగా సద్వినియోగిం చేసుకుంటోందని పేర్కొన్నారు.

ఈ పథకం కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విజయవంతంగా అమలవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలించిందని ఆయన కొనియాడారు. మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయా రాష్ట్రాల్లోని అసంఘటిత కార్మికులందిరకీ ఈ ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యెజన పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమనగా 18-50 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు దీనికి అర్హులు. ఏడాదికి రూ.330లు  ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఏ కారణం చేతైనా ప్రీమియం చెల్లించిన వ్యక్తి మరణిస్తే నామినీకి రూ.2లక్షలు బీమా సొమ్మును చెల్లించడం జరుగుతుంది.

ఏ బ్యాంకు ఖాతా నుండైనా ఈ పథకంలో సభ్యత్వం పొందవచ్చును. వీడియో సమావేశంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఉదయలక్ష్మి, కార్మిక శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.