గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2024 (09:18 IST)

భారీ ర్యాలీకి పవన్ ససేమిరా... ఒంటరిగా వెళ్లి జనసేనలో చేరనున్న బాలినేని

balineni srinivas
బలప్రదర్శ చేసి, భారీ సంఖ్యలో అనుచరణగణంతో వెళ్లి తన సత్తా ఏమిటి చూపించేందుకు వీలుగా ఒంగోలు నుంచి మంగళగిరి వరకు భారీ ర్యాలీతో వెళ్లి జనసేన పార్టీలో చేరాలని భావించిన మాజీ మంత్రి, వైకాపా మాజీ నేత బాలినేని శ్రీనివాస రెడ్డికి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. భారీ ర్యాలీతో వచ్చి పార్టీలో చేరేందుకు జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ససేమిరా అన్నారు. దీంతో బాలినేని ఒక్కరే ఒంగోలు నుంచి మంగళగిరికి వెళ్లి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. 
 
వైకాపా అధిష్టానం తనపట్ల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఇటీవలే ఆ పార్టీకి బాలినేని రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో జనసేనలో చేరికను ఘనంగా నిర్వహించాలని ఆయన పరితపించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒంగోలుకు రప్పించి... బలప్రదర్శన నిర్వహించి, అనుచరగణంతో పార్టీలో చేరాలని తలచారు. ఇదేసమయంలో ఆయన చేరికను కూటమి పార్టీల నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. 
 
పార్టీ మారినా గత పాపాల నుంచి తప్పించుకోలేరని... ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఆయన పని ఆయన చేసుకుంటారని, ఎవరికి అన్యాయం జరిగినా తాను ప్రశ్నిస్తానని బాలినేని ప్రతిస్పందించడంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో ఒంగోలులో సభ అవసరం లేదనీ, ఒక్కరే మంగళగిరి వచ్చి చేరాలని బాలినేనికి జనసేన అధిష్టానం కబురుపంపింది. నగరంలోనూ ప్రదర్శనలొద్దని స్పష్టం చేసింది. ఆయనతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్ కూడా పార్టీలో చేరతారని ప్రకటించింది. దీంతో మాజీమంత్రి చేరిక ప్రత్యేక కార్యక్రమం కాదన్నది స్పష్టమైంది. 
 
ఈ పరిస్థితుల్లో పార్టీ కీలక నాయకుడు వేములపాటి అజయ్ కుమార్ బుధవారం ఒంగోలు వచ్చారు. ఆయనతో జరిపిన చర్చల్లోనూ ఇదేవిషయం స్పష్టం చేయడంతో మాజీ మంత్రి శిబిరం డీలాపడింది. ఒకానొక దశలో చేరిక తాత్కాలికంగా వాయిదా పడిందన్న ప్రచారమూ సాగింది. కినుక వహించినా పరిస్థితిలో మార్పులేకపోవడంతో బాలినేని మెట్టు దిగకతప్పలేదు. తాను చేరాక మిగతా వారినీ పవన్ కల్యాణ్ సమక్షంలోనే పార్టీలో చేరుస్తానని క్యాడర్‌ను ఆయన బుజ్జగించినట్టు సమాచారం.