ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

పవన్‌తో నా స్నేహం.. మూడు పువ్వులు - ఆరు కాయలు : హాస్య నటుడు అలీ

ali
జనసేన పార్టీ అధినేత, సినీ హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో ఉన్న తన స్నేహంపై హాస్య నటుడు అలీ స్పందించారు. మా ఇద్దరి మధ్య స్నేహం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందని తెలిపారు. 'ఉత్సవం' మూవీ సక్సెస్ మీట్‌లో అలీ పాల్గొని మాట్లాడుతూ, 'మా ఇద్దరి అనుబంధం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది. పవన్‌తో కలిసి నటించే ఛాన్స్ లభిస్తే ఖచ్చితంగా చేస్తాను' అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చాడు.
 
అలీ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఎన్నికల అనంతరం వైసీపీకి టాటా చెప్పేశారు. ఇక ఎన్నికలకు సుమారు యేడాది ముందు మాట్లాడుతూ.. పార్టీ అధినేత జగన్ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్‌పై పోటీ చేయడానికి సిద్ధమని అలీ ప్రకటించిన విషయం తెలిసిందే. పైగా, ఆ సమయంలో పవన్‌పై విమర్శలు కూడా చేశారు. పలు సందర్భాల్లో నోరు పారేసుకున్నారు. 
 
నిజానికి పవన్, అలీ మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్య చక్కటి అనుబంధం ఉంది. పవన్ నటించిన దాదాపు అన్ని సినిమాల్లో అలీ నటించారు. వీరిద్దరి స్నేహం కేవలం సినిమాలకే పరిమితం కాదు... వ్యక్తిగతంగానూ ఎంతో సన్నిహితంగా మెలిగారు. అయితే పవన్ స్థాపించిన జనసేన పార్టీని కాదని అలీ వైసీపీలో చేరడం, అనంతర పరిణామాలతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. పవన్ కల్యాణ్ ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి బిజీగా మారిపోయారు. అలీ కూడా పెద్దగా సినిమాల్లో కనిపించకపోవడంతో వీరిద్దరూ తమ స్నేహబంధం గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో తమ స్నేహంపై అలీ కామెంట్స్ చేశారు.