మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (10:13 IST)

యువకుడిని చంపి బ్యాగులో కుక్కేశారు... ఎక్కడ?

ఏపీలోని చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఓ యువకుడిని బ్యాగులో కుక్కేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. 
 
తాజగా వెల్లడైన ఈ వివరాలను పరిశీలిస్తే, కుప్పం - కృష్ణగిరి జాతీయ రహదారి పక్కన నడుమూరు అటవీ ప్రాంతంలో వెళుతున్న స్థానికులకు గురువారం అనుమానాస్పదంగా ఉన్న ఓ బ్యాగు కనిపించింది. అందులో నుంచి ఓ మనిషి పాదాలు బయటికి కనిపిస్తూ ఉన్నాయి. దగ్గరికి వెళ్లి చూసేసరికి మనిషి మృతదేహంగా గుర్తించారు.
 
వెంటను భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాగు దగ్గరికి వెళ్లి తెరిచి చూసేసరికి అందులో మనిషి నడుము భాగం ఉంది. అయితే దుండగులు ఓ వ్యక్తిని రెండు ముక్కలుగా నరికేసి బ్యాగులో కుక్కేసినట్లు కనిపిస్తోంది. 
 
కానీ అందులో ఒక భాగం మాత్రమే పోలీసులకు కనిపించింది. మిగతా భాగం కోసం చుట్టు పక్కల అటవీ ప్రాంతంలో గాలించినా పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. అయితే హత్యకు గురైన వ్యక్తి దుస్తులను బట్టి కర్ణాటక ప్రాంతవాసిగా అనుమానిస్తున్నారు. 
 
ఎక్కడో హత్య చేసి ఇక్కడ మృతదేహాన్ని పడేశారని భావిస్తున్నారు. ఈ మేరకు తమిళనాడు, కర్ణాటక పోలీసులకు సమాచారం అందించారు. మనిషిని చంపి బ్యాగులో పెట్టారన్న వార్త చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియడంతో ఎవ్వరు ఆ పరిసర ప్రాంతానికి వెళ్లడానికి సాహసం చేయడం లేదు. తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.