ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (15:41 IST)

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఉగాది పర్వదిన వేడుక... సిద్ధాంతి ఏం చెప్పారో తెలుసా?

రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సంప్రదాయ బద్ధంగా పంచె కట్టుకుని వచ్చిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఈ వేడుకలో పాల్గొన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతుల సుబ్బరాజు సోమయాజులు పంచాంగ పఠనం చేశారు. అంతకు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అర్చకుల బృందం సీఎం వైయస్‌ జగన్‌ను ఆశీర్వదించింది. టీటీడీ అర్చకులు సీఎంకు స్వామి వారి ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

అనంతరం శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకల్లో సీఎం వైయస్‌ జగన్‌ పాల్గొన్నారు. శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి తొలి ప్రతిని ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతుల సుబ్బరాజు సోమయాజులుకు అందజేశారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్థాన సిద్దాంతి పంచాంగ పఠనం చేశారు.
 
పంచాంగ పఠనం:
‘ఈ ఏడాది అంతా బాగుంటుంది. మేఘాలు వర్షిస్తాయి. దీని వల్ల వ్యవసాయం బాగుంటుంది. పంటలు బాగా పండితే రాష్ట్రం సుబిక్షంగా ఉంటుంది. గత ఏడాది కంటే ఈసారి మెరుగైన ఆర్థిక పరిస్థితి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలే కాకుండా ప్రణాళికలు కూడా బాగుంటాయి.

గురు, శక్రుల సంచారం బాగుంది కాబట్టి, పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. సీఎం వ్యక్తిగత జాతకమైనా, ఈ ఏడాది పంచాంగంలో చూసినా ప్రజలకు ఇంకా చేరువయ్యే వీలుంది. కుంభంలో గురువు 9 నెలలు సంచారం చేస్తాడు కాబట్టి, వర్షాలు బాగా కురుస్తాయి. భూమి సస్యశ్యామలం అవుతుంది. దీంతో రైతులు కూడా సంతోషంగా ఉంటారు.

వర్షాలు బాగా కురవడం వల్ల చెరువులు, నదులు నీళ్లతో నిండుతాయి. పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది. ఈ ఏడాది విద్య, వ్యవసాయం, ఆర్థిక రంగాలు అన్నీ బాగుంటాయి’.. అని పంచాంగ పఠనంలో  కప్పగంతుల సుబ్బరాజు సోమయాజులు సిద్దాంతి వివరించారు.
 
ఉగాది పచ్చడి:
పంచాంగ పఠనం తర్వాత సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ను ఆశీర్వదించిన సిద్దాంతి, స్వయంగా ఉగాది పచ్చడి అందజేశారు. ఉగాది పచ్చడి స్వీకరించిన ముఖ్యమంత్రి, అనంతరం ప్రభుత్వ సిద్ధాంతి కప్పగంతుల సుబ్బరాజు సోమయాజులుతో పాటు, విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు లింగంభట్ల దుర్గాప్రసాద్, ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి వచ్చిన అర్చకులు ఏవీకే నరసింహాచార్యులు, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అర్చకులు  మామిళ్లపల్లి మృత్యుంజయప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు కోట రవికుమార్, వేద పండితులు ఆర్వీఎస్‌ యాజులును సత్కరించారు.
 
రాష్ట్రం సుబిక్షంగా ఉండాలి: సీఎం
‘ప్లవ నామ సంవత్సరం అంటే ఒక నావ అని అర్ధం. ఈ సంవత్సరం బాగుంటుందని సిద్దాంతి గారు కూడా చెప్పారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవాలని, రైతులందరికీ మంచి జరగాలని, ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.

అలాగే రాష్ట్రంలో ప్రతి ఇల్లు కూడా సుబిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, కోవిడ్‌ యుద్ధంలో మనం గెలవాలని ఆకాంక్షిస్తూ, మరోసారి ప్రతి ఒక్కరికి ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు’.. అంటూ సీఎం వైయస్‌ జగన్‌ రాష్ట్ర ప్రజలకు శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
 
ఆ తర్వాత వ్యవసాయ విశ్వవిదాలయం ప్రచురించిన వ్యవసాయ పంచాంగంతో పాటు, ప్రభుత్వ క్యాలెండర్‌ను సీఎం  వైయస్‌ జగన్‌ ఆవిష్కరించారు. 
 
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు , పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.