మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (19:29 IST)

మీడియాకు భయపడిన మరుక్షణం మీ పతనం ప్రారంభమైనట్టే.. ఉండవల్లి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైపోతుందోనన్న భయం ఇపుడు నెలకొందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులు మున్ముందు కొనసాగినపక్షంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మరింతగా దిగజారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. 
 
ఆయన బుధవారం రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ, దేశంలోని 540 మంది ఎంపీల్లో ఏపీకి 25 మంది ఎంపీలే ఉన్నారని, కేంద్రానికి మన అవసరం లేదు కాబట్టి ఏమీ చేయలేకపోతున్నామని అని ఊరుకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. 
 
భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రాజెక్టు పరిస్థితిపై ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలని కోరారు. 
 
కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయం విషయంలో ఖచ్చితంగా ఉండాలని, అవసరమైతే కేంద్రాన్ని నిలదీయాలని అన్నారు. అలా చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు. మనం అడగాల్సింది అడుగుతాం.. వారు ఇస్తే ఇస్తారు.. లేదంటే లేదు అంటే కుదరదన్నారు. 
 
ఒకవేళ అలాగే జరిగి ఉంటే జ్యోతిబసు పశ్చిమ బెంగాల్‌ను 25 ఏళ్లు పాలించి ఉండేవారు కాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే భయంగా ఉందని ఉండవల్లి అన్నారు. నోట్ల రద్దు ప్రభావం ఇప్పుడు దేశంపై నెమ్మదిగా పడుతోందని, ఆ సెగ ఆంధ్రప్రదేశ్‌కూ తాకుతుందని ఉండవల్లి పేర్కొన్నారు. జగన్‌పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అరుణ్ కుమార్ సూచించారు. 
 
అలాగే, రాష్ట్రంలో రెండు టీవీ చానెళ్లపై అప్రకటిత నిషేధం విధించడం సబబు కాదన్నారు. మీడియాపై ఆంక్షలు కొనసాగిస్తే.. అక్కడి నుంచే జగన్ ప్రభుత్వ పతనానికి బీజంపడుతుందన్నారు. గతంలో వైఎస్సార్ సీఎం అయిన సమయంలో సాక్షి పేపర్, సాక్షి చానల్ లేవని, ఆ సమయంలో మీడియా మొత్తం వైఎస్సార్‌కు వ్యతిరేకంగా ఉండేదని వెల్లడించారు. 
 
తనపై మీడియా అంత వ్యతిరేకత చూపించినా వైఎస్సార్ ఏనాడూ చానళ్లను, పత్రికలను నిషేధించలేదని, ఫలానా పత్రికలో తనకు వ్యతిరేకంగా రాస్తున్నారని మాత్రం చెప్పేవారని గుర్తుచేశారు. కానీ,  జగన్ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. 
 
'రాజశేఖర్ రెడ్డి ఏనాడూ మీడియా మీదికి వెళ్లలేదు. ఏ మీడియాను ఆపుచేయాలని ప్రయత్నించలేదు. ఈనాడులో ఇలా రాస్తారయా, ఆ రెండు పేపర్లు ఇంతేనని డైరెక్టుగా చెప్పేవాడు తప్ప, ఎవరిపైనా చర్యలకు దిగలేదు. ఇప్పుడు రాజమండ్రిలో రెండు చానళ్లు రావడంలేదు. 
 
నాకున్న సమాచారం ప్రకారం ప్రభుత్వమే రాష్ట్రం మొత్తం ఆపేయమందట. ఇంతకుముందు కేసీఆర్ ఇలాగే చేశాడు, చంద్రబాబు ఇలాగే చేశాడు. ఆ పని జగన్ మోహన్ రెడ్డికి తెలుసో తెలియదో కానీ, ఇది చాలా తప్పు. మీకు వ్యతిరేకంగా వచ్చే వార్తలకు మీరు భయపడిన మరుక్షణం మీ పతనం ప్రారంభమైనట్టే' అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు.