తిరుమలలో శాస్త్రోక్తంగా ఉట్లోత్సవం
శ్రీ కృష్ణజన్మాష్టమి వేడుకల్లో భాగంగా తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఉట్లోత్సవ ఆస్థానం మంగళవారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా జరిగింది. కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో ఈ వేడుకలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
శ్రీవేంకటేశ్వరస్వామివారికి గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మరునాడు ఉట్లోత్సవాన్ని(శిక్యోత్సవం) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులోభాగంగా శ్రీ మలయప్పస్వామివారిని బంగారు తిరుచ్చిపై ప్రసాదాలు తయారు చేసే పోటు లోనికి, శ్రీ కృష్ణస్వామివారిని మరో తిరుచ్చిపై పోటు మండపంలోని కి వేంచేపు చేసి నివేదన, హారతి ఇచ్చారు.
అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్వామివార్లను వేంచేపు చేసి ఆస్థానం, నివేదన, హారతి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఇఓ రమేష్ బాబు, వీజీవో బాలి రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.