1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (11:01 IST)

నంద్యాల : విలేఖరిని స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపిన కానిస్టేబుల్

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. తాను చేసే అక్రమాలను వెలుగులోకి తేవడమే కాకుండా, పై అధికారులకు ఫిర్యాదు చేశాడన్న కక్షతో ఓ విలేఖరిని పోలీస్ కానిస్టేబుల్ దారుణంగా హత్య చేశాడు. విలేఖరి పేరు చెన్నకేశవ. వి5 ఛానల్ జర్నలిస్టు. ఈ దారుణం కర్నూల జిల్లా నంద్యాలలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నంద్యాల టూటౌన్‌ కానిస్టేబుల్‌ వెంకట సుబ్బయ్యకు గుట్కా వ్యాపారాలతో సంబంధాలున్నాయి. పేకాట ఆడుతూ చాలాసార్లు పట్టుబడ్డాడు. దీంతో ఉన్నతాధికారులు అతడిని విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. 
 
తన సస్పెండ్‌కు వి5 ఛానల్‌ రిపోర్టర్‌ చెన్నకేశవ కారణమని భావించిన కానిస్టేబుల్‌ అతనికి ఫోన్‌ చేసి.. మాట్లాడాలని పిలిచాడు. కానిస్టేబుల్‌, అతని తమ్ముడు నాని ఇద్దరూ కలిసి జర్నలిస్టును స్క్రూడ్రైవర్‌తో పొడిచి హత్య చేశారు. 
 
వారి చేతుల్లో నుండి జర్నలిస్టు పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ మళ్లీ పట్టుకొని పొడిచి చంపారు. నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ సుధీర్‌ రెడ్డి పరిశీలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.