అమరావతి: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తితో వనం-మనం కార్యక్రమం చేపడుతున్నట్లు రాష్ట్ర అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా గుంటూరు జిల్లా కొండవీడు బ్లాక్ ఓబుల్ నాయుడు పాలెంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి శిద్ధా రాఘవరావు మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23 శాతం మేర అటవీ విస్తీర్ణం ఉందన్నారు. 2029 నాటికి రాష్ట్రంలో 50 శాతం మేర గ్రీన్ కవర్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 150 రోజుల పాటు జూలై ఒకటో తేదీ నుంచి వనం-మనం కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.
సీఎం చేతుల మీదుగా ప్రారంభించే ఈ కార్యక్రమంలో మొదటిరోజు రాష్ర్ట వ్యాప్తంగా కోటి మొక్కలు నాటేలా చర్యలు చేపట్టామన్నారు. అయిదు నెలల పాటు సాగే ఈ కార్యక్రమంలో 25 కోట్ల మొక్కలు నాటనున్నామన్నారు. వనం-మనం విజయంతానికి ప్రజా భాగ్యమ్యంతో నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలతో కలిసి సెమినార్లు, 5కె రన్, కళాశాల్లో డిబేట్లు నిర్వహించనున్నామన్నారు. గురువారం ఉదయం జరిగిన సమీక్షా సమావేశంలో, ఉద్యమస్ఫూర్తితో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం చంద్రబాబునాయుడు దిశా నిర్దేశం చేశారన్నారు.
అవసరమైన మేరకు నిధులు కేటాయిస్తామని భరోసా ఇచ్చారని మంత్రి తెలిపారు. వనం-మనం ముగింపు సందర్భంగా చివరలో వనమహోత్సవం పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. కాలేజీ, యూనిర్శిటీ విద్యార్థులు, పారిశ్రామిక వేత్తలు, అన్ని వర్గాల ప్రజలు వనం-మనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి శిద్ధా రాఘవరావు పిలుపునిచ్చారు. పరిశ్రమలకు అవసరమైన మొక్కలను తక్కువ ఛార్జీలతో అందజేయనున్నామన్నారు.
దేవాలయ పరిసర ప్రాంతాల్లో మొక్కలు అధిక సంఖ్యలో నాటేలా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు. కేవలం మొక్కలను నాటడమే కాకుండా, వాటికి జియోట్యాగింగ్ చేయనున్నామన్నారు. మొక్కలు నాటిన వారికే వాటిని పెంచే బాధ్యత అప్పగించనున్నామన్నారు. దేశంలోనే ఏపీని పచ్చదనం పెంపుదలలో అగ్రగామిగా నిలబెట్టడతామన్నారు.
అమరావతిలో నైట్ సఫారీ ఏర్పాటు...
రాజధాని ప్రజల సౌకర్యార్ధం అమరావతిలో నైట్ సఫారీ చేయనున్నామని చేపడుతున్నట్లు రాష్ట్ర అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. సింగపూర్ తరహాలో ఈ నైట్ సఫారీని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు. విశాఖ, తిరుపతిలో ఉన్న జూ లను నైట్ సఫారీలుగా అభివృద్ధి చేయనున్నామన్నారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు.
ప్రస్తుతం అయిదు ఎకో టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. అటవీ ప్రాంతాల్లో భూగర్భ జలాలతో చెక్ డ్యాములు, చెరువులు, పంట కుంటల్లో నీటి నిల్వ పెంపుదలకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. వర్షాల కారణంగా కిందకు జారే నీటిని ఒడిసి పట్టడానికి అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా చెక్ డ్యాముల నిర్మాణం చేపట్టనున్నామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ర్టంలో నగర వనాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు.
వ్యవసాయం మాదిరిగా రెడ్ శాండల్ పెంపకం...
రాష్ర్టంలో వ్యవసాయం మాదిరిగా రెడ్ శాండల్ పెంపకం చేపడతామని మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో రెడ్ శాండల్ మరింతగా పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 1,950 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం నిల్వల విక్రయానికి డీజేఎఫ్ టి అనుమతిచ్చిందన్నారు. ఈ మేరకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. 3 పర్యాయాలు టెండర్లు పిలవనున్నామని మంత్రి తెలిపారు. అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసుకోవాలని సీఎం చంద్రబాబు అనుమతిచ్చారన్నారు.
ప్రత్యేక యంత్రాలతో చెట్ల తరలింపు...
అభివృద్ధిలో భాగంగా రోడ్లకిరువైపులా ఉన్న చెట్లను ప్రస్తుతం నరికివేస్తున్నామని, భవిష్యత్తులో ఈ చెట్లను వేరే ప్రాంతానికి తరలించే యోచన ఉందని మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాలను ఉపయోగించే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు.
వనాలను దేవతలుగా పూజిద్దాం...
అటవీశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అనంతరాము మాట్లాడుతూ, ఉద్యమ స్ఫూర్తితో చేపడుతున్న వనం-మనం కార్యక్రమం విజయవంతానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. వనాలను దేవతలను పూజించి, ప్రపంచాన్ని పది కాలాల పాటు రక్షించుకుందుమన్నారు. అనంతరం వనం-మనం పోస్టర్లను మంత్రి శిద్ధా రాఘవరావు, అటవీశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అనంతరాము ఆవిష్కరించారు.