ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 28 జులై 2020 (10:14 IST)

గోవింద మొబైల్ యాప్‌లోనూ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం టికెట్లు

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో జూలై 31న వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రుగ‌నున్న‌ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఆన్‌లైన్ టికెట్ల‌ను టిటిడికి చెందిన గోవింద మొబైల్ యాప్ ద్వారా కూడా బుక్ చే‌సుకునే అవ‌కాశాన్ని టిటిడి క‌ల్పించింది. ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఈ టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు. 
 
భ‌క్తుల కోరిక మేర‌కు వ‌ర్చువ‌ల్ సేవ‌గా ప్ర‌వేశ‌పెట్టిన వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం టికెట్ల‌కు ఆన్‌లైన్‌లో భ‌క్తుల నుండి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. చాలామంది భ‌క్తులు టిటిడి వెబ్‌సైట్ ద్వారా ఈ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇప్ప‌టికే బుక్ చేసుకున్న ప‌లువురు భ‌క్తుల‌కు పోస్ట‌ల్ శాఖ ద్వారా పూజాసామగ్రిని బ‌ట్వాడా చేశారు.
 
పూజాసామగ్రికి ప్ర‌త్యేక పూజ‌లు:
వ‌ర‌ల‌క్ష్మీవ్ర‌తం టికెట్లు పొందిన భ‌క్తులకు అందించే ప్ర‌సాదాల‌కు సోమ‌‌వారం తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో  ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ముందుగా టిటిడి చీఫ్ ఇంజినీర్ ఎం.ర‌మేష్‌రెడ్డి ఆల‌య అధికారులు, అర్చ‌కుల‌తో క‌లిసి పూజాసామ‌గ్రిని ఆల‌య ప్ర‌ద‌క్షిణ‌గా ఊరేగింపుగా తీసుకెళ్లారు.

ఆ త‌రువాత అమ్మ‌వారి మూల‌విరాట్టు పాదాల వ‌ద్ద ఉత్త‌రీయం, ర‌విక‌, ప‌సుపు, కుంకుమ‌, గాజులు, అక్షింత‌లు, కంక‌ణాలు ఉంచి పూజ‌లు చేశారు. టికెట్లు బుక్ చేసుకున్న గృహ‌స్తుల గోత్రనామాలను అర్చ‌కస్వాములు అమ్మ‌వారికి నివేదించారు. అనంత‌రం ఈ పూజాసామ‌గ్రిని గృహ‌స్తుల‌కు బ‌ట్వాడా చేసేందుకు పోస్ట‌ల్ అధికారుల‌కు అంద‌జేశారు.
 
జూలై 31వ తేదీ ఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తంఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారమ‌వుతుంది. వ్ర‌తంలో పాల్గొనే భ‌క్తులు అర్చ‌క స్వాముల సూచ‌న‌ల మేర‌కు త‌మ గోత్ర ‌నామాల‌తో సంక‌ల్పం చెప్పాల్సి ఉంటుంది.
 
శ్రీ దుర్గాలయంలో..
వరలక్ష్మి వ్రతము రోజున ప్రధానాలయము నందు శ్రీ దుర్గాలయంలో అమ్మవారిని వరలక్ష్మి దేవిగా అలంకరించి, వరలక్ష్మి వ్రతము  నిర్వహించుటకు వైదిక కమిటీ వారు నిర్ణయించడమైనది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నివారణార్థం లాక్ డౌన్ అమలులో ఉన్నందున ప్రతీ ఏడాది నిర్వహించు సామూహిక వరలక్ష్మీ వ్రతములు (ఆర్జిత సేవ) మరియు ఉచిత సామూహిక ఆర్జిత సేవలను రద్దు చేయడమైనది.

భక్తుల సౌకర్యార్థం ప్రధాన ఆలయం నందు అమ్మవారికి ది.31-07-2020 ఉదయం 8-00 గా.లకు దేవస్థానం వారిచే జరిపించు వరలక్ష్మీ వ్రతము నిర్వహించబడును. సదరు వ్రతము నందు పరోక్షముగా వారి యొక్క గోత్రనామములతో జరిపించుకొనుటకు అవకాశం కల్పించబడినది.

టిక్కెట్టు కావలసిన భక్తులు  దేవస్థాన వెబ్ సైటు www.kanakadurgamma.org ద్వారా సొమ్ము చెల్లించి  టిక్కెట్టు పొందగలరు. పరోక్ష వరలక్ష్మీ వ్రతము జరిపించుకున్న భక్తులకు  ఖడ్గమాల చీర, రవిక మరియు కుంకుమ ప్రసాదము పోస్టు ద్వారా పంపబడునని, సేవా రుసుము రూ.1500 లు గా తెలియజేయడమైనది. 

02-08-2020 నుండి ది 04-08-2020 వరకు నిర్వహించు పవిత్రోత్సవములు సందర్భముగా ది 02-08-2020 నుండి ది 04-08-2020 వరకు దేవస్థానము నందు జరుగు అన్ని ఆర్జిత సేవలు (ప్రత్యక్షము మరియు పరోక్షము) నిలుపుదల చేయడమైనదని తెలియజేయడమైనది.