శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 13 జనవరి 2019 (15:40 IST)

జన్మభూమికి సేవ చేసేందుకే స్వర్ణభారత్ ట్రస్టు : ఉపరాష్ట్రపతి వెంకయ్య

జన్మభూమికి సేవ చేసేందుకే స్వర్ణభారత్ ట్రస్టును స్థాపించినట్టు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెల్లడించారు. స్వర్ణభారత్ ట్రస్టు రెండో వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీ రాధాకృష్ణన్, దర్శకుడు రాఘవేందరావు, మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 
 
సంక్రాంతి సంబురాల్లో భాగంగా అతిథులు గంగిరెద్దుల విన్యాసాలు తిలకించారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం కూడా స్వర్ణభారత్ లక్ష్యాల్లో ఒకటన్నారు. గంగిరెద్దుల ఆటలో ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయన్నారు. యజమాని ఆదేశం ప్రకారం నడుచుకోవడం అనే విషయం అందులో దాగి ఉందన్నారు. మన ప్రతి పండగ వెనుక శాస్త్రీయ సందేశం ఉందన్నారు. ఒకరికి మనమిచ్చే అభినందనలు యువతకు మరింత స్ఫూర్తిని ఇస్తుందని తెలిపారు.
 
ఒకప్పుడు మనదేశం స్వర్ణభారతం. మళ్లీ నాటి ఘనత పొందాలనేదే స్వర్ణభారత్ ట్రస్టు ఆశయమన్నారు. షేర్ అండ్ కేర్ అనేది మన సిద్ధాంతం. ఇతరులతో పంచుకోవాలి, ఇతరుల గురించి జాగ్రత్త తీసుకోవాలి. విదేశాలకు వెళ్లినా.. అక్కడ బాగా నేర్చుకుని మళ్లీ మనదేశానికి తిరిగి రావాలని యువతకు చెబుతుంటా. జన్మభూమికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వర్ణభారత్ ట్రస్టు ప్రారంభించినట్టు తెలిపారు. 18 సంవత్సరాలుగా ట్రస్టు తరపున సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. నా సంకల్పాన్ని కుమారుడు, కుమార్తె ముందుకు తీసుకెళ్తున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెల్లడించారు.