శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 29 ఫిబ్రవరి 2020 (13:24 IST)

వణికి చచ్చేట్టున్నారు!: విజయసాయి రెడ్డి

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. ఈ మేరకు విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు. ‘వైద్య శాస్త్రాల్లో ఎక్కడా ప్రస్తావన లేని ఫోబియా తండ్రీ, కొడుకులకు పట్టుకుంది.
 
‘పులివెందుల ఫోబియా’ ఒకటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తక్షణం నోటిఫై చేయాలి. లేకపోతే ఎక్కడ ఇద్దరు వాదులాడుకున్నా అందులో ఒకరు పులివెందుల నుంచి వచ్చాడని వణికి చచ్చేట్టున్నారు!’ అని వ్యాఖ్యానించారు.
 
‘ఉత్తరాంధ్ర ప్రజలంటే అంత చులకన భావమెందుకు చంద్రబాబూ? ఒక వైపు అమరావతి నుంచి రాజధాని తరలించ వద్దని ఉత్తుత్తి ఉద్యమాలు నడిపిస్తావు. మళ్లీ ఉత్తరాంధ్ర వెళ్లి అక్కడి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తావు. వారి ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటే ఇలాంటి శాస్తే జరుగుతుంది’ అంటూ మండిపడ్డారు. 
 
‘ప్రజలు ఉమ్మేస్తారన్న సిగ్గు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నావు చంద్రబాబూ. నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రను పరిపాలనా రాజధాని చేయాలని సిఎం జగన్ గారు నిర్ణయిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ బస్సు యాత్రకు బయలుదేరతావా? అమరావతి కోసం ఉత్తరాంధ్ర  ప్రజల నోటి దగ్గర ముద్దను లాక్కుంటావా?’ అని విజయసాయి రెడ్డి మరో ట్వీట్‌ చేశారు.
 
కాగా ఉత్తరాంధ్ర పర్యటన కోసం వచ్చిన చంద్రబాబుకు అక్కడ ప్రజలు... విమానాశ్రయంలో దిగ్భందించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు వైఎస్సార్‌ సీపీ, పులివెందుల నుంచి వచ్చినవారే కారణమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌ సీపీ తీవ్రంగా ఖండించింది.