వినోద, విహార, ప్రాకృతిక కేంద్రంగా విజయవాడ భవానీ ద్వీపం
అమరావతి : భవానీ ద్వీపం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం కానుంది. సహజసిద్దమైన ప్రకృతి అందాలకు విఘాతం కలగని రీతిలో ఈ అభివృద్ది ప్రణాళిక రూపుదిద్దుకోనుండటం విశేషం. అంతర్జాతీయ స్ధాయి హంగులతో ఇక్కడి వివిధ ద్వీపాలను పర్యాటక కేంద్రాలుగా త
అమరావతి : భవానీ ద్వీపం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం కానుంది. సహజసిద్దమైన ప్రకృతి అందాలకు విఘాతం కలగని రీతిలో ఈ అభివృద్ది ప్రణాళిక రూపుదిద్దుకోనుండటం విశేషం. అంతర్జాతీయ స్ధాయి హంగులతో ఇక్కడి వివిధ ద్వీపాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు పలు సంస్ధలు ముందుకు రాగా, బోస్టన్‌కు చెందిన సిబిటి సంస్ధను కన్సల్‌టెంట్‌గా ఎంపిక చేసారు. ఈ సంస్ధ దేశీయంగా స్టూడియోపాడ్ సంస్ధతో కలిసి బృహత్ ప్రణాళిక సిద్దం చేయనుండగా గురువారం ఈ అంశంపై పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు.
ఇప్పటికే భవానీ ద్వీపం పర్యాటక కేంద్రంగా నగర వాసులకు విశేష అనుభూతులను మిగిల్చుతుండగా, భవిష్యత్తులో ఇది జాతీయ స్ధాయి వినోద విహార ప్రాకృతిక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. స్ధానిక కాలమాన పరిస్ధితులకు అనుగుణంగా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఇప్పటివరకు భవానీ ద్వీపాన్ని అభివృద్ధి చేస్తూ రాగా, బృహత్ ప్రణాళిక రూపొందనున్న నేపధ్యంలో ఎప్పడు ఏ తరహా అభివృద్ది పనులు చేయాలన్న దానిపై మరింత స్పష్టత రానుంది.
ఈ ఉన్నతస్ధాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్ధ నిర్వహణా సంచాలకులు హిమాన్హు శుక్లా పాల్గొనగా, సిబిటి తరుపున ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ అర్బన్ డిజైన్ కిషోర్ వారణాసి, స్టూడియో పాడ్ నుండి అర్బన్ ప్లానర్ ఎంపి బినీత్ ప్రాధమికంగా బృహత్ ప్రణాళిక ఎలా ఉంటుందన్నది వివరించారు.
ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ పట్టణీకరణ కొత్త పుంతలు తొక్కుతున్న నేపధ్యంలో కాంక్రీట్ జంగిల్‌గా విజయవాడ నగరం మారిపోతుండగా, నగర జీవిని అలసట నుండి దూరం చేసేలా నూతన ప్రణాళిక ఉండనుందన్నారు. పర్యావరణ సమతౌల్యతకు పెద్దపీట వేస్తూ ప్రకృతిని ఆస్వాదించే విధంగా దేశంలోనే తొలిసారిగా బృహత్ ప్రణాళిక తయారుచేయాలన్నదే పర్యాటక శాఖ ఉద్దేశమన్నారు.
భవానీ ద్వీపంగా పిలవబడుతున్న చిన్న, పెద్ద అన్ని ద్వీపాలలోనూ అభివృద్ది ఉంటుందని అయితే ప్రతి ద్వీపం విస్తీర్ణంలోనూ అది పది శాతానికి మించబోదని తద్వారా ఇది అమరావతి వాసులకు ఒక బ్రీతింగ్ సెంటర్‌గా కూడా నిలుస్తుందన్నారు. వాస్తవికత, సహజత్వం దెబ్బతినకూడదన్నదే తమ ప్రధాన ఉద్దేశ్యమని ఆక్రమంలో ఇక్కడ సాంప్రదాయేతర ఇంధన వనరులకు వినియోగించుకుంటామని, సౌరశక్తి ఆధారిత విద్యుత్తును ఉత్పత్తి చేసి దానినే వినియోగిస్తామని మీనా వివరించారు. ఈ అంశాల మేరకే బృహత్ ప్రణాళికను తయారుచేయాలని కన్సల్‌టెంట్‌లకు సూచించామన్నారు.
మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఇక్కడ కళా గ్రామాలు, హస్తకళల కేంద్రాలు, బొటానికల్ గార్డెన్ రూపుదిద్దుకుంటాయన్నారు. పర్యాటకులు భవానీ ద్వీపంలోకి అడుగుపెట్టిన క్షణం నుండి ఎటువంటి విసుగు చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈ క్రమంలో ఒకేలా ఏదీ ఉండకూడదన్న ఆలోచనకు ఇక్కడ ప్రాణప్రతిష్ట చేయనున్నామన్నారు. ఒక ద్వీపంలో వినోదం, మరోచోట పర్యావరణ అనుకూల అటవీ ప్రాంతం, ఇంకో ద్వీపంలో పర్యాటకులకు అవసమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. కొంత భాగాన్ని చిత్తడి నేలగా అభివృద్ది చేస్తామని, పక్షుల సందర్శన కేంద్రంగా మరికొంత ప్రాంతం, దిగ్గజ భవనాలకు మరికొంత ప్రాంతం ఉండేలా బృహత్ ప్రణాళిక రూపుదిద్దుకోనుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. త్వరలోనే దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు దృష్టికి తీసుకువెళ్లి ఆయన ఆమోదం మేరకు కార్యాచరణలోకి దిగుతామన్నారు.