గడ్కరీకి కరోనా... దుర్గమ్మ వంతెన ప్రారంభోత్సవం వాయిదా.. కానీ...
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా వైరస్ సోకింది. దీంతో దుర్గమ్మ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదాపడింది. విజయవాడలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం కనకదుర్గ వంతెనను నిర్మించారు.
ముఖ్యంగా నల్గొండ, హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలు త్వరగా నగరాన్ని దాటేందుకు ఉపకరిస్తుందన్న అంచనాతో ప్రతిష్టాత్మకంగా ఈ వంతెనను నిర్మించారు. అయితే, ఈ వంతెన ప్రారంభోత్సవానికి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి.
వాస్తవానికి ఈ నెలారంభంలోనే ఈ వంతెన జాతికి అంకితం కావాల్సి వుండగా, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతితో వాయిదా పడింది. దీంతో శుక్రవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా వంతెనను ప్రారంభింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే, ఇపుడు నితిన్ గడ్కరీకి కరోనా సోకి, ఆయన ఐసొలేషన్‌లోకి వెళ్లిన నేపథ్యంలో, మరోమారు వంతెన ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ విషయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
'గడ్కరీ గారికి కరోనా రావటం వల్ల రేపు జరగబోయే కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా పడింది. కాని ప్రజా అవసరాల దృష్ట్యా కనకదుర్గ ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ రేపటి నుండి వదలటం జరుగుతుంది' అని నాని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.