సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 నవంబరు 2019 (14:44 IST)

బంగ్లాదేశ్ బాలికతో వ్యభిచారం... నెలకు రూ.50 వేలతో ఒప్పందం

బంగ్లాదేశ్ బాలికతో చేయిస్తూ వచ్చిన వ్యభిచార గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ దందా గుట్టుచప్పుడు కాకుండా విజయవాడలో కొనసాగుతూ వచ్చింది. పైగా ఆ బంగ్లాదేశీ బాలికకు నెలకు రూ.50 వేల చొప్పున మూడు నెలలకు రూ.3 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు బహిర్గతం చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బంగ్లాదేశ్‌లోని జూత్‌పూర్ గ్రామానికి చెందిన 17 యేళ్ల బాలికను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సరిహద్దులు దాటించి కోల్‌కతాకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి రాహుల్, ప్రియ కలసి బాలికను విమానంలో హైదరాబాద్ తీసుకొచ్చారు. అనంతరం జనార్దన్ నాయుడు, ప్రియ కలిసి బాలికను హైదరాబాద్ నుంచి బస్సులో విజయవాడ పంపారు.
 
ఆ యువతిని విజయవాడలో రిసీవ్ చేసుకున్న రవి అనే వ్యక్తి ఈ నెల 15 నుంచి 17 వరకు ఆమెతో వ్యభిచారం చేయించాడు. ఆ పిమ్మట 18వ తేదీన దేవినగర్‌కు చెందిన సూరవరపు మహేశ్ అనే వ్యక్తికి అప్పగించాడు. అతడు కూర వెంకట వరప్రసాద్ రెడ్డి అనే మరో వ్యక్తితో కలిసి బాలికతో వ్యభిచారం చేయించడం మొదలుపెట్టాడు. వారు ఉంటున్న ఇంటికి రోజూ జనం వచ్చిపోతుండడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు.
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం వ్యభిచార గృహంపై దాడిచేశారు. బాధిత బాలికతోపాటు నిందితులు ప్రసాద్‌రెడ్డి, మహేశ్‌లను అరెస్టు చేశారు. బాలికకు వైద్య పరీక్షల అనంతరం జువైనెల్ హోంకు తరలించారు. ఈ సందర్భంగా బాలిక మాట్లాడుతూ, తనకు పెళ్లైందని, మూడున్నర సంవత్సరాల బాబు కూడా ఉన్నాడని పేర్కొంది. కాగా, నిందితులు ఇద్దరికీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.