స్పెయిన్ అమ్మాయి ప్రేమలో తెలుగు అబ్బాయి, 'అనంత'లో పెళ్లి

couple
శ్రీ| Last Modified శుక్రవారం, 22 నవంబరు 2019 (16:22 IST)
అబ్బాయిది ఇండియా. అమ్మాయిది స్పెయిన్.. ప్రాంతాలే కాదు ఖండాలు కూడా వేరు.. మతాలు వేరు.. కులాలు వేరు. అయినా వారి మనసులు కలిశాయి. అన్ని ప్రేమకథల్లా వారికి పెద్దలు అడ్డంకి కాలేదు. పెళ్లి ఎవర్ని చేసుకోవాలన్న పరిణితి వారికుందని భావించి ఓకే చెప్పారు. ఇంకేముంది.. వేద మంత్రాలు.. ముత్యాల తలంబ్రాలు.. బాజాభజంత్రీల మధ్య విదేశీ అమ్మాయి మెడలో స్వదేశీ అబ్బాయి తాళి కట్టాడు. ఆ పెళ్లి వేడకను చూసి అందరూ ఆశీర్వదించారు.

వివరాలు చూస్తే అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన విజయ్ వైద్య విద్య అభ్యసించాడు. ఎంతో ఉన్నతమైన భవిష్యత్ ఉన్నప్పటికీ విదేశాలకు వెళ్లకుండా జిల్లాలో ఆర్డీటీ సంస్థ నిర్వహించిన ఆసుపత్రిలో వైద్యునిగా చేరారు. వేతనం గురించి పెద్దగా ఆలోచించకుండా పేద ప్రజలకు సేవ చేయాలన్నఆలోచనతో కణేకల్లు ఆర్డీటీ ఆసుపత్రిలో సేవలందిస్తున్నారు. సరిగ్గా ఇక్కడికి రెండున్నరేళ్ల క్రితం స్పెయిన్ దేశం నుంచి కార్లా అనే యువతి వచ్చింది. ఆర్డీటీ నిర్వహిస్తున్న ఆసుపత్రిలో సర్వీస్ మోటీవ్‌తో చాలామంది స్పెయిన్ దేశస్థులు సేవ చేస్తుంటారు. అందులో భాగంగా దంత వైద్యురాలైనా కార్లా ఆర్డీటీలో వాలంటరీగా పని చేస్తోంది.

ఇక్కడే విజయ్‌కు, కార్లాకు పరిచయం ఏర్పడింది. అది అనతి కాలంలోనే ప్రేమగా మారింది. ఇద్దరూ ఒ‍కర్ని ఒకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో సేవలందిస్తున్న వీరు తమ మనసులోని మాటను ఇరు కుటుంబాల వారికి చెప్పారు.

మొదట్లో కాస్త సంశయించినా.. విజయ్‌కు పెళ్లి ఎవర్ని చేసుకోవాలో ఆలోచించే పరిణితి ఉందని భావించి పెద్దలు కూడా ఓకే చెప్పారు. దీంతో వీరద్దరి పేర్లు పెళ్లి కార్డుల్లోకి ఎక్కాయి. వేరే దేశానికి చెందిన అమ్మాయిని చేసుకుంటున్నానని చెప్పి అహ్వాన పత్రికలు పంచారు. తాడిపత్రిలోని పాండురంగస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా సాంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా వీరి పెళ్లి జరిగింది.

స్పెయిన్ దేశానికి చెందిన కార్లా కూడా మన దేశ సాంప్రదాయాల ప్రకారమే పెళ్లి జరగాలని కోరుకుంది. అందుకే అచ్చమైన తెలుగింటి పెళ్లికూతురులా మారిపోయింది కార్లా. బంధువులు, సన్నిహితుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా ఈ జంట ఒక్కటైంది. ముత్యాల తలంబ్రాలు చల్లుకుని.. పెద్దల ఆశీర్వాదాలు తీసుకుని తమ బంధాన్ని ఒక్కటి చేసుకున్నారు.
పెళ్లికి వచ్చిన వారు సైతం వీరి పెళ్లిని నిండు మనసుతో ఒప్పుకున్నారు. ఈ విదేశీ అమ్మాయి.. స్వదేశీ అబ్బాయి ఒక్కటి కావటాన్ని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు.దీనిపై మరింత చదవండి :