గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 31 డిశెంబరు 2021 (16:33 IST)

విజయవాడ నుండి కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి బస్సు ప్రారంభం

కాల‌జ్ణ్నానం బోధించిన వీర బ్ర‌హ్మేంద్ర‌స్వామిని ద‌ర్శించాల‌నుకునే వారికి ఇదో అవ‌కాశం. భ‌క్తులకు పుణ్య క్షేత్రమైన కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి  విజయవాడ నుండి నేరుగా ఇప్పటి వరకు బస్సు సర్వీసు లేకపోవడంపై విశ్వ బ్రాహ్మణ డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ చొరవ తీసుకున్నారు.  ఎపీఎస్ ఆర్ టీ సీ స్టేట్‌ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లిఖార్జున రెడ్డికి  బస్సు సర్వీస్ పై  విజ్ఞాపన చేయగా, ఆయన వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు అందించారు. 
 
 
శుక్రవారం నాడు మొట్ట మొదటి బ్రహ్మంగారి మఠం సర్వీసు బస్సుని లాంఛనంగా విజయవాడ జోనల్ చైర్మన్ తాతినేని పద్మావతి, విశ్వబ్రాహ్మణ డవలప్ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ ప్రారంభించారు.  బ్రహ్మం గారి చిత్రపటానికి, బస్సుకి ప్రత్యే క పూజలు నిర్వహించి స‌ర్వీసును ప్రారంభించారు. ఈ  సందర్భంగా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారు మాట్లాడుతూ, విన్నపంపై వెంటనే స్పందించి డైరెక్ట్ బస్ సర్వీసు ఏర్పాటు చేయించిన రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి, ఏపీఎస్ఆర్టీసీ స్టేట్ చైర్మన్ మల్లికార్జున రెడ్డికి, విజయవాడ జోనల్ చైర్మన్ తాతినేని పద్మావతికి ధన్యవాదాలు తెలిపారు. 
 
 
బ్రహ్మంగారి మఠం డైరెక్ట్ బస్ సర్వీస్ వల్ల విజయవాడ, కోస్తా ఆంద్ర  జిల్లాలకు చెందిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి భక్తులకు కుటుంబాలతో నేరుగా బ్రహ్మంగారి మఠం ఆలయానికి వెళ్ళ‌డానికి  సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. జోనల్ చైర్మన్ తాతినేని పద్మావతి మాట్లాడుతూ, ఈ బస్సు సర్వీసు ద్వారా కోస్తా ప్రాంత బ్రహ్మంగారి భక్తులంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, భక్తులు పెరిగితే మరి కొన్ని సర్వీసులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ కృష్ణా రీజియన్ ఇంచార్జి ఆర్ ఎం సుధాకర్, పి.ఎన్.బి.ఎస్ సి.టి.ఎం బషీర్ అహ్మద్, ఏటీఎం బి.రామ్ మోహన్ రావు, ఏపీటీడీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.పి.శేషగిరిరావు, కృష్ణా జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చెవూరి రమేష్, జవ్వాది సుధీర్, పేదప్రోలు బ్రహ్మం, బంగారు కళ్యాణ సంఘం మహిళా నాయకురాలు లక్కోజు సుజాత పాల్గొన్నారు.