నడిరోడ్డుపై మద్యం మత్తులో మహిళ చీర లాగేసిన యువకులు
విశాఖ జిల్లాలో ఓ మహిళకు అవమానం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు నడిరోడ్డుపై ఓ మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఆమె చీర లాగేసి నలుగురిలో ఆమెను అవమానపరిచారు. అంతేకాదు, కులం పేరుతో ఆమెను తీవ్ర దుర్భాషలాడారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళ్తే.. నర్సీపట్నంకు చెందిన నానిబాబు స్థానికంగా ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం భార్య రాజేశ్వరి, సోదరుడు అప్పలరాజుతో కలిసి ఆటోలో నర్సీంపట్నం ఆసుపత్రికి బయలుదేరాడు. మార్గమధ్యలో వెనకాల వచ్చిన ఓ బైక్ ఆటోను ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ట్రాఫిక్ సమస్య కారణంగా నాని సైడ్ ఇవ్వకపోవడంతో.. కొంతదూరం వెళ్లాక బైక్‌పై ఉన్న యువకులు ఆటోను అడ్డగించారు.
ఆటోలో నుంచి నానిని బయటకు లాగి చితకబాదారు. అడ్డుకోబోయిన అతని భార్య రాజేశ్వరి చీర లాగేశారు. కులం పేరుతో దుర్భాషలాడారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. నిందితులను బొడగ రామకృష్ణ, ఎలిశెట్టి రామకృష్ణలుగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.