శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 3 మే 2019 (11:56 IST)

పెళ్లి చూపులు పేరుతో ఇంటికి పిలిచి గొంతునులిమి హత్య చేశారు...

విశాఖపట్టణం జిల్లా చోడవరంలో ఓ యువతిని గొంతు నులిమి హత్య చేసిన కేసులో ముద్దాయిలుగా తేలిన దంపతులకు కోర్టు జీవితకారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. పెళ్లి చూపులు పేరుతో ఓ యువతిని ఇంటికి పిలిచి గొంతునులిమి హత్య చేసినట్టు కోర్టు నిర్ధారించింది. 
 
తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, విశాఖ జిల్లా చోడవరం సమీపంలోని మాడుగుల మండలం వమ్మలి జగన్నాథపురం గ్రామానికి చెందిన మైచర్ల పరదేశి నాయుడు భార్య వెంకటలక్ష్మి డ్వాక్రా గ్రూపు లీడర్‌గా కొనసాగుతూ వస్తోంది. అయితే, ఈ గ్రూపుకు మంజూరైన రూ.2 లక్షలను వెంకటలక్ష్మి స్వాహా చేసింది. 
 
ఈ విషయాన్ని అదే గ్రామానికి చెందిన కోలా నాగమణి (30) గుర్తించి, వెంకటలక్ష్మి నిర్వాకాన్ని బయటపెట్టడంతో సంఘ సభ్యులు ఆమెను గ్రూప్‌ లీడర్‌గా తొలగించి, ఆ స్థానంలో నాగమణిని లీడర్‌గా ఎన్నుకున్నారు. వెంకటలక్ష్మి స్వాహా చేసిన రూ.2 లక్షలను గ్రూప్‌ లీడర్‌ అయిన తర్వాత నాగమణి తిరిగి కట్టించింది. ఈ ఘటన తర్వాత వెంకటలక్ష్మి, ఆమె భర్త పరదేశినాయుడు గ్రామాన్ని వదలిపెట్టి వచ్చి కె.కోటపాడుకు వెళ్లిపోయారు. 
 
అయితే, తమను గ్రూపు లీడర్ పదవి నుంచి తొలగించడమేకాకుండా గ్రామం విడిచి వెళ్లేలా చేసిన నాగమణిపై ఆ దంపతులు కక్ష పెంచుకున్నారు. ఈ విషయంలో బయటపడకుండా నాగమణితో సఖ్యతగానే ఉంటున్నట్టుగా నటించారు. ఆమెకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నట్టు మభ్యపెడుతూ వచ్చారు. వెంకటలక్ష్మి దంపతులు చెప్పిన మాటలను నాగమణి పూర్తిగా నమ్మింది. 
 
2012 నవంబరు 2న నాగమణి చీడికాడ మండలం తునివలసలో బంధువుల ఇంట్లో వివాహానికి హాజరైంది. అదే వివాహానికి హాజరైన పరదేశినాయుడు కె.కోటపాడులో పెళ్లి చూపులు ఉన్నాయని నమ్మించి బైక్‌పై ఎక్కించుకుని తీసుకువెళ్లాడు. అయితే కె.కోటపాడుకాకుండా విజయనగరం జిల్లా వేపాడ మండలం నీలకంఠరాజుపురం వద్దకు తీసుకువెళ్లి నాగమణిని గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని సూదివలస సమీపంలోని రైవాడ కాలువలో పారేసి వెళ్లిపోయాడు. ఆమె ఒంటిపై ఉన్న మూడున్నర తులాల బంగారాన్ని భార్య వెంకటలక్ష్మికి ఇచ్చాడు.
 
తమ కుమార్తె ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా నాగలక్ష్మి హత్యకు గురైన విషయాన్ని గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపగా, నాగమణిని హత్య చేసింది పరదేశి నాయుడు దంపతులని తేలింది. ఆ తర్వాత వారిని అరెస్టు చేయగా కేసు విచారణ స్థాని 9వ అదనపు జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.