మంగళవారం, 22 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 మే 2016 (08:57 IST)

మెదక్ ప్రజలు ముడ్డి మీద తన్నారు.. ముసలావిడను ఎండలో తిప్పుతున్నారు : కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, కార్యనిర్వహణాధ్యక్షుడు భట్టి విక్రమార్కపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాటలతూటాలు పేల్చారు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి కాదనీ ఉత్తర కుమార్ రెడ్డి, అలాగే భట్టి విక్రమార్క కాదనీ, ఒట్టి విక్రమార్క అని ఎద్దేవా చేశారు. 
 
ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల ప్రచారం వాడివేడీగా సాగుతోంది. ఈ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, తెరాస నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేటీఆర్ ఓ బచ్చా అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తనదైనశైలిలో స్పందించారు.
 
మెదక్ ఎన్నికల్లో తెరాసను 3 లక్షల మెజారిటీతో గెలిపించి, కాంగ్రెస్ పార్టీ నేతలను మెదక్‌ ప్రజలు ముడ్డి మీద తన్నారని, వరంగల్‌లో కూడా డిపాజిట్‌ గల్లంతు చేసి ప్రజల్లో వారి స్థానమేంటో అక్కడ ప్రజలు గుర్తు చేశారన్నారు. 
 
ఇకపోతే.. 'నేను బచ్చాగాడినైతే నాకంటే రెండుమూడు సంవత్సరాలు మాత్రమే పెద్ద అయిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఏమనాలి' అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. 'పాలేరులో లక్ష మెజారిటీతో గెలుస్తామంటున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌ రెడ్డి ఓడిపోతే పదవికి రాజీనామా చేస్తారా.. అని నేను చేసిన సవాల్‌ను ఎందుకు స్వీకరించటం లేదు?' అని కేటీఆర్ ప్రశ్నించారు.
 
అకాల మరణం చెందిన పాలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబంపై అంత ప్రేమే ఉంటే ఆయన సతీమణి సుచరితా రెడ్డిని ఎమ్మెల్సీ చేయొచ్చు కదా? అని నిలదీశారు. ఓడిపోతామని తెలిసీ, ముసలావిడను ఎండలో తిప్పుతున్న మీరు మానవత్వం గురించి మాకు నీతులు చెబుతున్నారా? అంటూ మండిపడ్డారు.