మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (17:37 IST)

ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్? క్రష్ గేట్లపై నుంచి ప్రవహిస్తున్న నీరు

శ్రీశైలం డ్యాం ప్రమాదంలో పడినట్టు తెలుస్తోంది. ఈ డ్యామ్‍కు అమర్చిన క్రష్ గేట్లపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, దీనిపై ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని డ్యామ్ పర్యవేక్షణ ఇంజనీర్లు అంటున్నారు. స్పిల్‌వే నుంచి నీరు ప్ర‌వ‌హిస్తున్నా.. దాంతో ఎటువంటి ప్ర‌మాదం లేద‌ని వారు స్ప‌ష్టంచేశారు. 
 
కాగా, శ్రీశైలం డ్యాం వద్ద ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో వరద నీటిని దిగువకు విడుదల చేసే క్రమంలో ఏపీ జలవనరుల శాఖ ఇన్ చార్జి సూపరింటెండెంట్ ఇంజినీరు (ఎస్ఈ) శ్రీనివాస రెడ్డి తన సతీమణితో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను స్విచాన్ చేయించి ఎత్తించారు. 
 
సుంకేసుల, జూరాల నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో ఆ వరద ప్రవాహమంతా శ్రీశైలం చేరుకుంటోంది. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించి ఎస్ఈ భార్యతో రెండు గేట్లు ఎత్తించారు. ఈ చర్య విమర్శల పాలవుతోంది.
 
మరోవైపు, మంగ‌ళ‌వారం ఉద‌యం డ్యామ్‌లో నీటి సామ‌ర్థ్యం 884.8 అడుగులుగా ఉంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటమట్టం 885 అడుగులు. ఇప్పటికే పూర్తి స్థాయికి నీరు చేరడంతో స్వ‌ల్ప స్థాయిలో స్పిల్ఓవ‌ర్ జ‌రుగుతోంది. నిండు కుండలా ఉన్న డ్యామ్‌లో స్వ‌ల్ప స్థాయిలో అల‌లు వ‌స్తుంటాయ‌ని, దాని వ‌ల్ల క్ర‌ష్ గేట్ల‌పై నుంచి నీరు ప్ర‌వ‌హిస్తుంద‌ని ఇంజినీర్లు వివరిస్తున్నారు. 
 
నీరు అధికంగా ఉన్న‌ప్పుడు.. నీరు దూక‌డం స‌హ‌జ‌మే అని డ్యామ్ సూప‌రింటెండింగ్ ఇంజినీర్ ఎం. శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఇన్‌ఫ్లో 3.5 ల‌క్ష‌ల క్యూసెక్కులు ఉంద‌ని, డ్యామ్‌ను 13 ల‌క్ష‌ల క్యూసెక్కుల కోసం నిర్మించార‌న్నారు. 2009లో వ‌చ్చిన వ‌ర‌ద‌ల స‌మ‌యంలో డ్యామ్‌ 25 ల‌క్ష‌ల క్యూసెక్కులు త‌ట్టుకుందని ఆయన చెబుతున్నారు.