సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (11:14 IST)

పల్నాడులో 144 సెక్షన్... ఛలో ఆత్మకూరుకు పర్మిషన్ లేదు : గౌతం సవాంగ్

తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ఛలో ఆత్మకూరుకు ఎలాంటి అనుమతులు లేవని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. అదేసమయంలో పల్నాడులో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. వైకాపా కార్యకర్తల దాడుల్లో గాయపడిన టీడీపీ శ్రేణులకు అండగా నిలబడేందుకు టీడీపీ ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేపట్టే ఊరేగింపులకు అనుమతులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
 
ఇకపోతే, కర్నూలు జిల్లా హోసూరులో ఉద్రిక్తతలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. మొహర్రం సందర్భంగా కర్నూలు ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. మహిళలపై లాఠీచార్జిని ఖండిస్తున్నట్టు వెల్లడించారు. మహిళలపై లాఠీచార్జి కారణంగా ప్రజలే తిరగబడి పోలీసుల వాహనాలు దగ్ధం చేసే పరిస్థితి వచ్చిందని, రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు ఇదే నిదర్శనమన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని, ముందస్తు అప్రమత్త చర్యలు చేపట్టాలని హితవు పలికారు.