శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 20 మే 2019 (11:11 IST)

క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్న యువరాజ్ సింగ్

భారత బెవాన్‌గా పేరుగాంచిన క్రికెటర్ యువరాజ్ సింగ్ తన క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నాడు. భారత క్రికెట్ జట్టులో ఒకపుడు అద్భుతమై ఆల్‌రౌండర్‌గా ఓ వెలుగు వెలిగిన యూవీ.. కేన్సర్ బారినపడ్డారు. ఈ వ్యాధికి చికిత్స తీసుకుని మళ్లీ క్రికెట్‌లో రాణించాడు. కానీ, ఇపుడు ఫామ్‌లో లేక జట్టులో చోటు కోల్పోయాడు. 
 
పైగా, ఇకపై జట్టులో స్థానం ఆశించడం కంటే కెరీర్‌కు స్వస్తి చెప్పి ఇతర వ్యాపారాలపై దృష్టిసారించాలని భావిస్తున్నారు. పైగా, బీసీసీఐ అనుమతి తీసుకుని రిటైర్మెంట్‌ ప్రకటించాలని, అనంతరం విదేశాల్లో జరిగే టీ20 క్రికెట్‌పై దృష్టిసారించాలని భావిస్తున్నట్లు సమాచారం.
 
2011 ప్రపంచ్‌కప్‌ విజేత జట్టులో సభ్యుడైన యువరాజ్‌ ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఓ వెలుగు వెలిగారు. గాయాలు, కేన్సర్‌కు చికిత్స కారణంగా బ్యాటింగ్‌ వాడి తగ్గడంతో క్రమంగా అతని ప్రాభవం మసకబారింది. ఈనెలలో ఇంగ్లండ్‌లో జరగనున్న వరల్డ్‌ కప్‌లో అవకాశం వస్తుందని ఆశించిన యువరాజ్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో కూడా తన సత్తాచాటే సరైన అవకాశం దక్కలేదు.
 
ఇక టీమిండియా తరపున ఆడడం సాధ్యంకాదన్న నిర్ణయానికి వచ్చిన యువరాజ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించడమే బెస్ట్‌ అని భావిస్తున్నారట. ఇందుకోసం బీసీసీఐ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాడు. అనుమతి రాగానే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. యువరాజ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించినా బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే టీ20 పోటీల్లో పాల్గొంటాడని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు.