బుధవారం, 26 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2025 (22:43 IST)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

Delhi air pollution
దేశ రాజధాని ఢిల్లీలో వాయు గాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మరింత ప్రమాదకరస్థాయికి దిగజారుతోంది. దీంతో ప్రజల మనుగడకు ముప్పు వాటిల్లేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయం దృష్టిసారించింది. నగరంలో కాలుష్యానికి కారణమయ్యే వాహనాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించింది. మరోవైపు, విద్యుత్ వాహనాల రవాణాను మరింతగా ప్రోత్సహించేలా చర్యలు తీసుకోనున్నారు. 
 
ఢిల్లీ వాయు నాణ్యత మరింత క్షీణిస్తోన్న వేళ ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీలో ఇంకా 37 శాతం పాత (బీఎస్‌ I నుంచి బీఎస్‌ III) వాహనాలు ఉన్న విషయాన్ని ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. 
 
ఈ నేపథ్యంలో ఈవీ వాహనాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఇందుకు సంబంధించి సబ్సిడీలతోపాటు ఛార్జింగ్‌ స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులకు సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలను గణనీయంగా తగ్గించాలని ఆదేశించినట్లు సమాచారం.