శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 మే 2020 (09:29 IST)

ఉత్తుత్తి ఉరి కాస్త నిజమైంది.. భార్యను బెదిరించబోయిన భర్త మృతి

భార్యను బెదిరించబోయిన ఓ భర్త తన ప్రాణాలను కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వెస్ట్ గోదావరి జిల్లా, తాళ్ళపూడి మండలం, మలకపల్లికి చెందిన జి.గణేష్ (35) అనే వ్యక్తి భార్య ఐదు నెలల క్రితం అంటే జనవరిలో కువైట్‌కు వెళ్లింది. ఆ తర్వాత కరోనా వైరస్ వ్యాపించింది. దీంతో అనేక ప్రభుత్వాలు విదేశీ కార్మికులను తమతమ దేశాలకు తరలి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించాయి. కానీ, గణేష్ భార్య మాత్రం అవేమీ పట్టించుకోకుండా అక్కడే ఉండిపోయింది.
 
ఇది భర్తకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తక్షణం తన భార్యను స్వదేశానికి రప్పించే ప్రయత్నం చేశాడు. ఇందులోభాగంగా, ఆయన భార్యను బెదిరించేందుకు ఉరి నాటకమాడారు. అయితే, ఆ ఉత్తుత్తి ఉరి కాస్త నిజమైంది. మెడకు బిగించుకున్న ఉరి కాస్త ప్రమాదవశాత్తు మెడకు బిగించుకుని ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ మొత్తం ఘటనను ఆయన సెల్‌ఫోనులో చిత్రీకరించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.