శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 2 జులై 2020 (16:51 IST)

వైసీపీలో సామాజిక న్యాయం ఏది?: సీపీఐ

ఏపీలో అధికారం వెలగబెడుతున్న వైసీపీలో సామాజిక న్యాయం కొరవడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దుయ్యబట్టారు.

గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...‘‘సామాజిక న్యాయం అంటూ పదే పదే చెప్పే జగన్ కు.. వైసీపీలో సామాజిక న్యాయం లేదని తెలియదా?, మూడు ప్రాంతాల్లో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు అప్పగించారు. మీ పార్టీలో వేరే కులాల వారు లేరా? వారు పదవులకు పనికి రారా?

రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో అంతా మీ బంధువులే ఉన్నారు. 70 మందిలో 46 మంది మీ కులం వారే ఉన్నారు. సెర్చ్ కమిటీల్లో 12 మందికి 9 మంది రెడ్లకే ఇచ్చారు. ముగ్గురు, నలుగురే మొత్తం నడిపిస్తున్నారు.

ఎస్సీ నాయకులు పదవులకు పనికిరారా? ధర్మాన, పిల్లి సుభాష్ చంద్రబోస్, అంబటి రాంబాబు, పార్థసారథి వంటి వారు పదవులకు పనికిరారా? ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ఒక్కరైనా ముఖ్యమంత్రితో మాట్లాడే పరిస్థితి ఉందా?

కమ్యూనిస్టులకు కులం అంటగట్టే ముందు మీ పార్టీలో పదవులు ఎవరికీ ఇచ్చారో చూడండి. వీటిన్నింటికీ సీఎం జగన్ సమాధానం చెప్పాలి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల రెండు అవాస్తవాలు మాట్లాడారు.

విద్యుత్ కొనుగోళ్లు విషయంలో కేంద్రమంత్రి ఓ మాట.. రాష్ట్ర సలహాదారు ఓ మాట చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తింటే.. కేంద్రమంత్రి మాటలకు మీ పరువు పోదా? ఆమె మాటలు అబద్ధం అయితే ఎందుకు కేసు పెట్టడం లేదు’’ అని ప్రశ్నించారు.

సెంటున్నర స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించుకోవటం సాధ్యమా?:
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కరోనా రాష్ట్రంలోనూ దేశంలోనూ తీవ్రంగా విజృంభిస్తోందన్నారు. ప్రభుత్వాలపై ఆధారపడకుండా ప్రజలు స్వీయ నియంత్రణ చర్యలు తీసుకోవాలని, అడ్డగోలు విధానాలను ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయన్నారు.
 
 రాజధాని భూముల్లో ఇండ్ల స్థలాలు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. భూసేకరణలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలని, అమరావతి ఉద్యమం ప్రారంభమై 4 వ తేది నాటికి 200 రోజులవుతోందని, ఈ సందర్భంగా 4 వ తేదీన ఉదయం 10: గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోరాట దీక్షలో అన్ని వర్గాల ప్రజలు,అన్ని రాజకీయ పార్టీలు, జేఏసీ ల నాయకులు, కార్యకర్తలు వారివారి ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల వద్ద భౌతిక దూరం పాటిస్తూ పాల్గొనాలని కోరారు.

అమరావతి జేఏసి నిర్ణయాలకు సిపిఐ సంపూర్ణ మద్దతిస్తోందన్నారు. దశాబ్దాలుగా దళితులు అనుభవిస్తున్న భూములను పేదల ఇళ్ల స్థలాల పేరిట లాక్కుంటున్నారు. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించుకోవటం సాధ్యమా ? అడిగారు.
 
పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నమన్నారు. ఇళ్ల పట్టాల భూసేకరణలో అన్ని చోట్లా కుంభకోణాలు జరుగుతున్నాయని, స్థానిక ఎమ్మెల్యేలు రైతుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.