ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (10:34 IST)

విద్యుత్ ఛార్జీలపై బహిరంగ చర్చకు సిద్ధం: వైసీపీకి బీజేపీ సవాల్

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో విద్యుత్ ఛార్జీలు ఎక్కువుగా వసూలు చేస్తున్నారని బీజేపీ నేత పాతూరి నాగభూషణం ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ చేసిన వ్యాఖ్యలను రాజకీయంగా చూడటం సరి కాదన్నారు.

ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం రెడ్డి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల విషయంలో బహిరంగ చర్చకు తాము సిద్ధమని... దమ్ముంటే వైసీపీ నేతలు రావాలని సవాల్ విసిరారు. ఏపీలో కరెంటు కోతలు లేవంటే.. అది కేంద్రం అమలు చేస్తున్న విధానాల వల్లే అన్నారు.

కరోనా కష్టకాలంలో ప్రజలు ఉంటే.. రెండు, మూడు నెలల  బిల్లును ఒకేసారి ఇచ్చి  శ్లాబు పెంచి వసూలు చేశారని ఆయ‌న ఆరోపించారు. బీజేపీ సీనియర్ నేత సత్యమూర్తి మాట్లాడుతూ... కరోనా కష్ట కాలంలో మోదీ చేపట్టిన చర్యలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు.

ఈ ఏడాది పాలనలో అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో పాటు, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. బీజేపీ ఏపీకి చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

తెలుగువాళ్లకు గర్వకారణమైన పీవీ శతజయంతి ఉత్సవాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ఆయన సేవలకు గుర్తుగా జయంతి ఉత్సవాలను నిర్వహించాలని ఆయ‌న డిమాండ్ చేశారు.