1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : ఆదివారం, 15 మార్చి 2020 (10:08 IST)

తెలంగాణలో మే లేదా జూన్​ నుంచి కొత్త విద్యుత్​ ఛార్జీలు

తెలంగాణలో మే లేదా జూన్​ నుంచి విద్యుత్​ ఛార్జీలు పెంచనున్నారు. దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ఛార్జీల అమలుకు విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు లెక్కలు కడుతున్నాయి.

వచ్చే ఏడాదికి సంబంధించిన ‘వార్షిక ఆదాయ అవసరాల’ (ఏఆర్‌ఆర్‌) నివేదికను డిస్కంలు ఈ నెలాఖరుకల్లా రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)కి అందజేయనున్నాయి. 10- 15 శాతం మేర పెంపు ప్రతిపాదనలను కూడా ఇందులో పొందుపరుస్తున్నాయి. మే లేదా జూన్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 70 వేల మిలియన్‌ యూనిట్లు (ఎంయూ) ఉన్న విద్యుత్‌ వినియోగం వచ్చే ఏడాది రూ. 75 వేల ఎంయూలు దాటవచ్చని అంచనా.

నివేదిక ఇచ్చాక 45 రోజుల్లోగా ఈఆర్‌సీ విచారణ చేసి ఆదేశాలు ఇస్తుంది. ఈ నెలాఖరున నివేదిక ఇస్తే మే లేదా జూన్‌ ఆరంభం నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. ఒక యూనిట్‌ కరెంటు సరఫరాకు సగటున రూ.7 వరకూ వ్యయమవుతోంది.

ప్రస్తుత ఛార్జీల ప్రకారం వచ్చే ఏడాది ఆదాయ, వ్యయాల మధ్య రూ.11 వేల కోట్లకు పైగా లోటు ఏర్పడనుంది. బడ్జెట్​లో ప్రభుత్వం ఇంధనశాఖకు రూ.10 వేల కోట్లు కేటాయించింది. ఇందులో రూ.320 కోట్లు పాత అప్పుల చెల్లింపు, ఇతర ఖర్చులకు ఇస్తే, మిగిలిన రూ.9680 కోట్లతో లోటు తీరదు.

దీన్ని పూడ్చుకునేందుకే ఛార్జీల పెంపును ప్రతిపాదిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత తొలి ఏడాది మాత్రమే పరిమితంగా కొన్ని వర్గాలకు ఛార్జీలు పెంచారు. ఆ తరువాత పెంచలేదు. ఇన్నేళ్లలో కనెక్షన్లు 43 లక్షల వరకూ పెరిగి కోటిన్నర దాటాయి.

ఒక్క వ్యవసాయ బోర్లకే అదనంగా 5.30 లక్షల కనెక్షన్లు ఇవ్వడం వల్ల వాటి సంఖ్య 24.32 లక్షలకు చేరింది. ఆదాయం రాని కనెక్షన్లే అధికం... ఆదాయం తెచ్చేవాటికన్నా... తక్కువ ఛార్జీలకో, ఉచితంగానో వాడుకునే కనెక్షన్లు అధికమవుతున్నాయి.

ఉదాహరణకు వ్యవసాయానికి పూర్తి ఉచితంగా కరెంటు ఇస్తున్నారు. 200 యూనిట్ల లోపు వాడే వినియోగదారుల నుంచి యూనిట్‌కు రూ.1.45 నుంచి రూ. 4.30 వరకు వసూలు చేస్తున్నారు. ఇలాంటి కనెక్షన్ల సంఖ్య పెరిగినా డిస్కంలకు ఆదాయం పెద్దగా రాదు.

ఈ వర్గాలకు రాయితీలిచ్చేందుకే ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తోంది. దీనికితోడు రాష్ట్రం ఏర్పడిన తరువాత 23 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన తీసుకున్నారు. ఐదు వేల వరకు కొత్త ఉద్యోగాలు భర్తీ చేశారు. వీటన్నిటి వల్ల ఆర్థికభారం పెరిగిందని డిస్కంలు చెబుతున్నాయి.