మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (11:05 IST)

చంద్రబాబు బాణీలకు నాట్యం చేస్తున్నాడు: మాజీ ఎమ్మెల్యేలు

పవన్‌ కళ్యాణ్‌ కాపుల సంక్షేమంపై వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వంను శ్వేతపత్రం కోరడం విడ్డూరంగా వుందని వైయస్‌ఆర్‌సిపి నేతలు, మాజీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, ఆమంచి కృష్ణమోహన్‌ అన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే కాపులకు రూ.4769 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు.

కార్పొరేషన్ల ద్వారా వివిధ ప్రభుత్వ పథకాల్లో అర్హులైన కాపు లబ్ధిదారుల ఖాతాలకే సొమ్మును జమ చేసిందని తెలిపారు. దీనిపై కనీస పరిజ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ ప్రకారం జనసేన నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
 
కాపుల సంక్షేమానికి ఈ 13 నెలకాలంలోనే 4,769 కోట్లు  వైయస్‌.జగన్‌ ప్రభుత్వం ఖర్చు చేసిందని, అదే గత టీడీపీ హయాంలో 5 ఏళ్లకాలంలో రూ. 1874 కోట్లు మాత్రమేనని వారు అన్నారు. అప్పుడూ ఇప్పుడూ కార్పొరేషన్‌ ద్వారానే సంక్షేమ పథకాలకు నిధులను కేటాయించారని తెలిపారు.

వైయస్‌.జగన్‌ పరిపాలనలో అమ్మ ఒడి, రైతు భరోసా, వాహనమిత్ర, చేదోడు, నేతన్న నేస్తం, కాపు నేస్తం పథకాల ద్వారా కాపు అక్కచెల్లెమ్మలకు చరిత్రలో అత్యధిక సాయం అందిచారన్నారు. చంద్రబాబు పాలనలో మొదటి ఏడాదిలో కాపులకు కేటాయింపులు సున్నా అని గుర్తుచేశారు.

రెండో ఏడాది రూ.100 కోట్లు పెట్టి ఖర్చు చేసింది కేవలం రూ.96 కోట్లు మాత్రమేనన్నారు. మొదటి 2 ఏళ్లలో కాపు కార్పొరేషన్‌ ద్వారా చంద్రబాబు రూ. 96 కోట్లు ఇచ్చినా పవన్‌కళ్యాణ్‌ ఎందకు నోరెత్తలేదని ప్రశ్నించారు.

రూ.5 ఏళ్ల బాబు హయాంలో పవన్‌ –బాబుల కాంబినేషన్‌లో కాపు కార్పొరేషన్‌కు బడ్జెట్‌కేటాయింపులు కేవలం రూ. 3,100 కోట్లు. ఇస్తానన్న రూ.5వేల కోట్లకుగాను ఖర్చు చేసింది రూ.1874.6 కోట్లు, లబ్ధిదారులు కేవలం 2,54,335 మందేనన్న వాస్తవాలను ఎందుకు విస్మరించారని నిలదీశారు.

అదే ఈ 13 నెలల్లో కాపు కార్పొరేషన్‌ ద్వారా సంక్షేమ పథకాలపై వ్యయం రూ.4,769.5 కోట్లు. లబ్ధిదారులు 22,89,319 మందని, ఈ నిజాలు పవన్‌కళ్యాణ్‌కు ఎందుకు కనిపించడంలేదన్నారు. గత ప్రభుత్వంలోనైనా, ఇప్పుడైనా సంక్షేమ పథకాలకు కార్పొరేషన్ల ద్వారానే నిధులు కేటాయిస్తున్నారన్న విషయాన్ని ఎందుకు చెప్పడంలేదన్నారు.

ఏటా రూ.2000 కోట్లు కార్పొరేషన్‌ద్వారా ఖర్చుచేస్తామన్న మాటకు కట్టుబడ్డ వైయస్‌.జగన్‌ సర్కార్, 2019–20లో అంటే అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో కార్పొరేషన్‌ ద్వారా రూ.3,392.43 కోట్లు కాపులకోసం ఖర్చు చేసిన విషయాన్ని గమనించాలన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ మరో రూ.1377 కోట్లు ఖర్చుచేశామని, వాస్తవాలతో పనిలేకుండా చంద్రబాబు బాణీలకు పవన్‌ నాట్యంచేస్తున్నారని విమర్శించారు. 
 
కాపులను బీసీల్లో కలిపానంటూ ఒక డ్రామా, ఆ తర్వాత ఆర్థికంగా వెనకబడ్డ ఈబీసీ కోటాలో ఇచ్చే అవకాశం లేకపోయినా 10శాతంలో 5 శాతం  ఇస్తున్నానంటూ మరో డ్రామా చంద్రబాబు చేశారని, మొత్తంగా కాపులు బీసీలా?  ఓసీలా? అంటే నోరెత్తకుండా అధికారంలో నుంచి దిగిపోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు సిగ్గులేకుండా ముందుకు తోస్తుంటే.. దానికి తగ్గట్టుగా పవన్ ఆడుతున్నారని విమర్శించారు.

మేనిఫెస్టో ప్రకారం కాపులకు  ఇచ్చిన హామీలను జగన్ అమలు చేస్తున్నారన్నారు. వివిధ పథకాలద్వారా వైయస్‌.జగన్‌ సర్కారు విడుదల చేసిన నిధుల వివరాలను మాజీ ఎమ్మెల్యేలు వివరంగా తెలియజేశారు.

వైయస్‌ఆర్‌ కాపునేస్తం పథకం ద్వారా 2,35,873 మంది కాపు అక్కచెల్లెమ్మలకు రూ.354 కోట్ల రూపాయలను ఇటీవలే వారి ఖాతాలకు జమ చేశారని వారు గుర్తు చేశారు. అలాగే ఏడాది కాలంలోనే వివిధ పథకాల ద్వారా మొత్తం 22,89,319 మంది కాపులకు రూ.4,770 కోట్ల రూపాయలను అందించారని అన్నారు.

జగనన్న అమ్మ ఒడి ద్వారా 3,81,185 మందికి రూ.571.78 కోట్లు, జగనన్న విద్యాదీవెన ద్వారా 1,23,257 మంది లబ్ధిదారులకు రూ.367.63 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద 96,739 మందికి రూ.92.93 కోట్లు, వైయస్‌ఆర్‌ రైతుభరోసా కింద 7,56,107 మందికి 1,497.29 కోట్లు,

వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కింద 3,92,646 మందికి రూ.1125.88 కోట్లు, వైయస్‌ఆర్‌ వాహనమిత్ర కింద 29,957 మందికి రూ.57.07 కోట్లు, జగనన్న చేదోడు (టైలర్లు) కింద 14021 మందికి రూ.14.02 కోట్లు, వైయస్‌ఆర్‌ నేతన్ననేస్తం కింద 2577 మందికి రూ.6.18 కోట్లు, విదేశీ విద్యాదీవెన కింద 533 మందికి రూ.29.45 కోట్లు, వైయస్‌ఆర్‌ జగనన్న ఇళ్ళపట్టాల కింద 2,56,424 మందికి రూ.663.42 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. 
 
ఇంత మేలు వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వంలో జరుగుతుంటే పవన్‌ కళ్యాణ్‌ కళ్ళకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సమాచార హక్కు చట్టం ద్వారా, లేదా ప్రభుత్వ డాష్‌బోర్డ్‌ ద్వారా ఏ పథకం కింద ఎవరికి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవచ్చిని, ఈ చిన్న విషయం కూడా పవన్‌ కళ్యాణ్‌ కు తెలియకపోవడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని విమర్శించారు. 
 
వైయస్‌ఆర్‌సిపి అధికారంలోకి వచ్చిన తరువాత కాపులకు ఏం చేస్తాయో చాలా స్పష్టంగా తన మేనిఫెస్టోలో ప్రకటించిదని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి కనీస అవగాహన కూడా పవన్‌ కళ్యాణ్‌ కు లేదని అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వంలో కాపులకు జరిగిన సంక్షేమం ఏమిటీ, ఈ రోజు వైయస్‌ జగన్‌  అమలు చేస్తున్న పథకాలు ఏమిటో ఒక్కసారి గమనిస్తే, పవన్‌ కళ్యాణ్‌ కు కళ్ళు తెరుచుకుంటాయని అన్నారు. కాపులను నమ్మించి మోసం చేసే నైజం చంద్రబాబుకు అలవాటు అని, నమ్మిన వారిని ఆదుకునే స్వభావం వైయస్‌ జగన్‌ ది అని అన్నారు.

ఎన్నికల సమయంలో వైయస్‌ జగన్‌ ఏది చెప్పారో, దానినే ప్రజలు విశ్వసించడం వల్ల రికార్డు స్థాయిలో 151 సీట్లు కట్టబెట్టారని అన్నారు. జగన్‌ సీఎం అయిన ఈ ఏడాది కాలంలో తమకు, తమ సామాజికవర్గంకు అన్యాయం జరిగిందని ఏ ఒక్కరైనా బయటకు వచ్చి అడిగిన దాఖలాలు లేవని అన్నారు.

వైయస్‌ఆర్‌ కాపునేస్తం పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళ మధ్య వయస్సులో వున్న అక్కచెల్లెమ్మలకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తుంటే సహించలేకపోతున్నారా అని ప్రశ్నించారు. 
 
2014 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పవన్‌ కళ్యాణ్‌ పనిచేశారని, టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఏనాడైనా కాపులకు జరుగుతున్న కార్యక్రమాలపై ఎందుకు ప్రశ్నించలేదో పవన్‌ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

మంగళగిరిలో పార్టీ బహిరంగసభలో చంద్రబాబు, లోకేష్‌ ల అవినీతిపై భారీగా విరుచుకుపడ్డ పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల్లో తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని అన్నారు. ఇదే మంగళగిరిలో లోకేష్‌ పై ఎందుకు పవన్‌ తన పార్టీ అభ్యర్థిని నిలబెట్టేలేదని ప్రశ్నించారు.

అందుకు ప్రతిఫలంగా ఆయన పోటీ చేసిన గాజువాకలో చంద్రబాబు పర్యటించకుండా సహకరించుకున్నారని ఆరోపించారు. బీమవరంలో కాపు సామాజికవర్గంకు చెందిన గ్రంథి శ్రీనివాస్‌ పై పోటీకి దిగి సొంత సామాజికవర్గం వ్యక్తినే ఓడించేందుకు పవన్‌ ప్రయత్నించాడని, ఇదేనా మీకు కాపు సామాజికవర్గంపై వున్న ప్రేమ అని ప్రశ్నించారు.

మొదటి నుంచి పవన్‌ చంద్రబాబు చెప్పుచేతల్లో నడుస్తున్నాడని, ఆయన ఏది చెబితే అదే చేస్తున్నాడనే విషయాన్ని గ్రహించడం వల్లే కాపులు పవన్‌ కళ్యాణ్‌ ను విడిచిపెట్టారని అన్నారు. ఉభయగోదావరిజిల్లాల్లో వైయస్‌ఆర్‌సిపి ఏకపక్షంగా విజయాలు సాధించడానికి కాపులు వైయస్‌ జగన్‌ ని విశ్వాసంలోకి తీసుకోవడమే కారణమని అన్నారు. ఈ విషయం గ్రహించలేని స్థితిలో పవన్‌ కళ్యాణ్‌ వున్నాడని అన్నారు. 
 
2014లో చంద్రబాబుతో కడవడం ద్వారా పవన్‌ కళ్యాణ్‌ చారిత్రాత్మక తప్పిందం చేశాడని మాజీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, ఆమంచి కష్ణమోహన్‌ లు విమర్శించారు. జనసేన పార్టీ పేరుతో రాజకీయాల్లో పవన్‌ కళ్యాణ్‌ రావడంతో కాపులు తిరిగి రాజకీయంగా తమకు ప్రాధాన్యత లభిస్తుందని ఆశిస్తే... చంద్రబాబు లో లాలూచీపడి మరోసారి కాపులను పవన్‌ కళ్యాణ్‌ మోసం చేశాడని అన్నారు.

కాపులను బిసిల్లో చేరుస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆనాడు ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాన్ని దారుణంగా చంద్రబాబు అణచివేశారని అన్నారు. చివరికి ఉద్యమంలో జరిగిన సంఘటనలను ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ కి అంటగట్టే నీచ రాజకీయాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. చివరికి కాపుజాతిని అవమానించేలా చంద్రబాబు మాట్లాడుతుంటే...పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

ఈ పరిణామాలపై ఆనాడు టిడిపిలో వున్న కాపు ఎమ్మెల్యేలంతా చంద్రబాబు సమక్షంలోనే అసంతప్తిని వ్యక్తం చేశామని అన్నారు. ఉద్యమంలో పాల్గొన్నారని, ప్రశ్నించారని కాపులపై కేసులు పెట్టి, కోర్టుల చుట్టూ తిప్పిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, దాని ఫలితంను గత ఎన్నికల్లో ఆయన, ఆయనకు అండగా నిలిచిన పవన్‌ కళ్యాణ్‌ చవిచూశారని అన్నారు. 

చంద్రబాబు డైరెక్షన్‌ లో నడుస్తున్న పవన్‌ కళ్యాణ్‌ ను చూసి, ఆయన వెంట నడిచిన వారు ఎందరో జనసేనను వదిలిపెట్టారని అన్నారు. ఈ పరిణామాలపై పవన్‌ కళ్యాణ్‌ ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇంకా వైయస్‌ఆర్‌సిపిపై అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ మాదిరిగా సీఎం కావాలనే ఉద్దేశంతో జగన్‌  రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో ఆయన తన రాజకీయ నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు. 
 
కాపు రిజర్వేషన్లపై మాట్లాడే కనీస అర్హత కూడా పవన్‌ కళ్యాణ్‌ కు లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో బిజెపి, టిడిపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రకాళిక సందర్బంగా 9వ షెడ్యూల్‌ ద్వారా కాపు రిజర్వేషన్లను పరిష్కరించాలని పట్టుబట్టి ఉంటే, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా అని పవన్‌ కళ్యాణ్‌ ను ప్రశ్నించారు.

ఒకవైపు సుప్రీం తీర్పు వల్ల యాబైశాతంకు మించి రిజర్వేషన్లు పెంచే పరిస్థితి లేదని తెలిసి కూడా చంద్రబాబు కాపు రిజర్వేషన్లపై చేసిన డ్రామాల వల్ల కాపులు నష్టపోయారని అన్నారు. రాష్ట్రం పరిధిలో లేని అంశంపై అటు టిడిపి, ఇటు జనసేన కూడా తమ మేనిఫెస్టోలో కాపు రిజర్వేషన్లు సాధిస్తామని ప్రకటించి కాపులను మోసం చేశారని అన్నారు.

ఒక్క వైయస్‌ఆర్‌సిపి మాత్రమే దీనిపై వివరంగా తన మేనిఫెస్టోలో ప్రకటించిందని గుర్తు చేశారు. కాపు రిజర్వేషన్ల విషయలో బిసి హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం జరగకుండా రిజర్వేషన్లు కల్పించే విషయానికి మా మద్దతు వుంటుందని ప్రకటించిందని అన్నారు.

మంజునాథ కమిషన్‌ నివేదిక ఇవ్వకముందే చంద్రబాబు కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపితే, ఇది చట్ట విరుద్దమని పంపిన కాగితాలు తిరిగి వచ్చిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు బంధువులు రంగను చంపడం ద్వారా ఆనాడు కాపుల ఐక్యతను భగ్నం చేశారని, తరువాత ముద్రగడ గారి ఆధ్వర్యంలో మరోసారి కాపులు ఐక్యమైన సందర్బంలో మరోసారి దానిని ఇదే చంద్రబాబు దారుణంగా భగ్నం చేశారని అన్నారు.

అటువంటి చంద్రబాబుకు పవన్‌ కళ్యాణ్‌ వత్తాసు పలుకుతూ మాట్లాడుతున్నాడని అన్నారు. పార్టీ అధ్యక్షుడుగా పవన్‌ కళ్యాణ్‌ రాజీనామా చేసి, కాపు ఉద్యమాన్ని కొనసాగిస్తే కాపుజాతి ఆయనను విశ్వసిస్తుందని సూచించారు. ఇదే తరహాలో పవన్‌ కళ్యాణ్‌ వ్యవహరిస్తే, కాపులే పవన్‌ కళ్యాణ్‌ ను తరిమితరిమి కొట్టే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు.