శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (20:01 IST)

చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ పతనం: ఎమ్మెల్యే సుధాకర్ బాబు

"చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చి దిగిపోతే.. ఏడాది క్రితం అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ఒకవైపు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధివైపు, నవశకం వైపు నడిపిస్తున్నారు. కష్టకాలంలో కూడా నేతన్న నేస్తం పథకం ద్వారా  చేనేతలకు ఏటా రూ.24,000 ఇస్తున్నారు. మరోవైపు ఆయా సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోని బలహీన వర్గాలకు, దళితులకు, మైనార్టీలకు ఆప్తుడుగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిలబడ్డారని" సంతనూతలపాడు ఎమ్మెల్యే  టీజేఆర్ సుధాకర్ బాబు తెలిపారు. 

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడారు. రూ.2.50 లక్షల కోట్ల అప్పులతో ఆంధ్రరాష్ట్ర భవిష్యత్‌ను సర్వనాశనం చేసి చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయారని టీజేఆర్ అన్నారు. జగన్ అధికారం చేపట్టే నాటికి ఆర్థిక వ్యవస్థ చిందరవందరగా ఉందన్నారు.

ఒకవైపు దుబారా తగ్గించుకుంటూ.. ఆనాడు సీఎం హోదాలో చంద్రబాబు చేసిన దుబారా ఖర్చులు.. విదేశీ ప్రయాణాలు, కన్సల్టెన్సీ ఫీజులు, విమానపు ఖర్చులు, ప్రచారపు ఖర్చులు,  భవనపు నిర్మాణ ఖర్చులు, నీటి ఖర్చులు, హైదరాబాద్ హోటల్, రిసార్ట్‌లో ఉండే ఖర్చులు తగ్గించుకుంటూ.. వ్యూహాత్మకంగా తనకు ఉన్న పరిమితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కబెట్టుకుంటూ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సంక్షేమ బాట పట్టించారు. ఆర్థికపరమైన బాధను భరిస్తూ కూడా.. జగన్ చెప్పిన మాటకు కట్టుబడి తన కోసం ఆశగా ఎదురు చూస్తు్న్న  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు తోడు ఉన్నానని నిరూపించారని సుధాకర్ బాబు అన్నారు. 
 
నేతన్న ఆత్మగౌరవంతో నమ్మిన వృత్తిలో చీరలు నేస్తూ మన ఆత్మగౌరం ప్రపంచానికి చాటారని సుధాకర్ బాబు అన్నారు. అటువంటి నేతన్నలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. అయితే.. గత ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా జగన్ మోహన్ రెడ్డి ధర్మవరంలో ఇచ్చిన ప్రమాణాన్ని తూ.చ. తప్పకుండా పాటిస్తూ ఈరోజు రెండో విడత రూ.24,000 నేతన్నల అకౌంట్లలో వేశారని సుధాకర్ బాబు పేర్కొన్నారు.

బీసీ వర్గాలకు జగన్ ప్రభుత్వం సాయం అందిస్తోందన్నారు. జాలర్లకు, టైలర్లకు ఆర్థిక సహాయం, సున్నా వడ్డీ సహాయం, రైతు భరోసా, అమ్మ ఒడి పథకం అయినా ఇవన్నీ కూడా ఏపీ రాష్ట్ర రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయం సృష్టించాయన్నారు. బాగా డబ్బులు ఉన్నవారికి, ఏసీ కార్లలో తిరిగేవారికి, ఆర్థిక స్థితిమంతులకు ఈ కోణాలు అర్థం కావని సుధాకర్ బాబు అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి 3648కి.మీ సుదీర్ఘ పాయాత్రలో ఆయన ప్రతి వర్గాన్ని కలిశారు. వారి బాధలు చూసి ప్రణాళిక రచించారు. ఆ ప్రణాళిక నుంచి పుడుతున్నవే ఈ పథకాలని సుధాకర్ బాబు తెలిపారు. గత పాలకులకు ఈ ఆలోచన రాలేదా అంటే రాలేదనే చెప్పాలన్నారు. ఒక్క మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి మాత్రమే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ లాంటి పథకాలు వచ్చాయని సుధాకర్ బాబు గుర్తు చేశారు.

ఈరోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాల పరంపర రూ.40,000 కోట్ల పైచిలుకు ఆర్థిక వనరులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లబ్ధిదారులకు చేరిపోయాయన్నారు. వాటిలో బీసీల వాటా రూ.20,000 కోట్లు, ఎస్సీల వాటా రూ.6,000 కోట్ల పైచిలుకు ఉందన్నారు. రూ.26,000 కోట్లుకు పైగా ఎస్సీ, బీసీలకు సంక్షేమ పథకాల రూపంలో అందించారన్నారు. కరోనా సమయంలో సంపాదించే వనరులు లేవు. ఇంట్లో కూర్చునే పరిస్థితిలోనూ ఐదుసార్లు రేషన్ ఇవ్వటంతో పాటు.. రూ.వెయ్యి ఆర్థికసాయం జగన్ అందించారని సుధాకర్ బాబు అన్నారు. ఈ కోణాలను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని సుధాకర్ బాబు కోరారు.
 
రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పతనం అయిందని అది సుస్పష్టంగా కనపడుతోందని సుధాకర్ బాబు అన్నారు. పైగా డాంభికాలు మాట్లాడటం కోసం 40 ఏళ్ల చరిత్ర ఉన్న రాజకీయ నాయకుడు అని చెప్పుకోవటానికి మా తాతలు నేతులు తాగారని మా మూతులు వాసన చూడండని చెప్పటంలా ఉందని సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు.

రాజ్యసభలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య ఈరోజుకు 6కు చేరిందన్నారు. టీడీపీకి ఒకే ఒక్క ఎంపీ మిగిలిపోయారని లోక్‌సభలో టీడీపీకి ముగ్గురు మాత్రమే ఎంపీలు ఉన్నారని తద్వారా రెండు సభల్లో కలిపి 4కు వస్తే.. వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి రెండు సభల్లో కలిపి 28కి సభ్యుల సంఖ్య పెరిగిందన్నారు.

చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ పూర్తిగా నాశనం అయిందని పతనం పరాకాష్టకు చేరటం అనేది సంఖ్యల ద్వారానే తెలుస్తోందన్నారు. ఒకరితో ప్రారంభమైన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రయాణం అంచెలుఅంచలుగా ఎదుగుతూ... 67 మంది ఎమ్మెల్యేలకు చేరి ఈరోజు 151 ఎమ్మెల్యేలు, 28 మంది ఎంపీలతో ప్రచండంగా ఎదుగుతున్న ఈ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం ముందు 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు తోకముడిచి దాక్కున్నారు.

చంద్రబాబు ఈరోజు రాష్ట్రంలో లేరు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని ఇది సత్యమని సుధాకర్ బాబు అన్నారు. చంద్రబాబు ఏపీలో రాజకీయ ఉనికిని కోల్పోవటమే కాకుండా నివసించటానికి రాజకీయం చేయటానికి ఏ కోణంలోనూ లేడని.. సంపూర్ణమైన పతనం చెందాడని సుధాకర్‌ బాబు అన్నారు. 
 
రాజకీయ క్రీడ ఆడటానికి.. తైతక్కలు వేయటానికి జూమ్ ఆనే ఆప్‌తో ఇంట్లో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్‌లు చంద్రబాబు పెడుతున్నారని సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. ఆ మీటింగ్‌లను బాబు భజన మీడియా మోస్తోందన్నారు.

కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. రూ.42,000 కోట్ల లబ్ధిని ప్రజలకు నేరుగా వైయస్‌ జగన్ అందించారు. ప్రధాని ప్రకటించిన ప్యాకేజీలోని రూ.20 లక్షల కోట్లను నేరుగా ప్రజల అకౌంట్లలో వేయమని ఆర్థిక నిపుణులు చెబుతున్న సమయంలోనే జగన్ ఆమాటలు వింటూనే తన పని తాను చేశారన్నారు. రూ42వేల కోట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వం నుంచి నేరుగా వారి అకౌంట్లకు బదిలీ చేశారు. అంతేగాక రేషన్‌ అందించారు. కరోనా మహమ్మారి విషయంలో అత్యధిక టెస్టులు చేయటం జరిగిందని సుధాకర్ బాబు అన్నారు. 
 
రాజ్యసభ ఎన్నికల్లో తగిన బలం లేదని తెల్సి కూడా ఎస్సీ కులానికి చెందిన వర్ల రామయ్యను ఎంపిక చేసి చంద్రబాబు బలిపశువు చేశారు. టీడీపీ నయవంచన రాజకీయాలకు దళిత సమాజం నిట్టనిలువున అవమానం పడిందని సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గతంలో ఎంపీల లెక్కలు చూద్దాం అని... 2012లో టీడీపీకి రెండు రాజ్యసభ సభ్యులు ఇచ్చే అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు వర్ల రామయ్య గుర్తు రాలేదా? ఆరోజు గరికపాటి రామ్మోహనరావు, సీతామహాలక్ష్మికి ఇచ్చారు. ఇద్దరూ ఓసీలే. ఆరోజు ఎస్సీలు గుర్తుకు రాలేదన్నారు. 2016లో టీడీపీకి ముగ్గురికి ఎంపీ సీట్లు ఇచ్చారు. అప్పుడు సురేష్‌ ప్రభు, టీజీ వెంకటేశ్, సుజనా చౌదరికి ఇచ్చావు కానీ అప్పుడు వర్ల రామయ్య గుర్తు రాలేదా? జేఆర్‌ పుష్పరాజ్ గుర్తుకు రాలేదా? మా సోదరులు కూడా ఆలోచించాలని సుధాకర్ బాబు కోరారు.

దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబు ఇలాకాలో ఒక్క క్షణం కూడా మీరు ఉండటానికి వీల్లేదని సుధాకర్ బాబు కోరారు. ఈరోజున వర్ల రామయ్యను పోటీలో నిలబెట్టి ఆయన్ను అవమానించటం అనేది దళిత సమాజానికి జరిగిన ఘోరమైన అవమానంగా భావిస్తున్నామన్నారు. నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరిని ఎందుకు నిలబెట్టలేదు. లేకపోతే బాలకృష్ణ రెండో అల్లుడును ఎందుకు నిలబెట్టలేదని సుధాకర్‌ బాబు ప్రశ్నించారు.

గెలిచే సీట్లు మీకు.. ఓడిపోయేటప్పుడు దళితులు కావాలా? అని సుధాకర్ బాబు మండిపడ్డారు. ఏమిటీ అహంభావం, ఏమిటీ కుట్ర .. గెలవాలంటే 36 మంది ఎంపీలు కావాలి. ఉన్నది 23 మంది ఎమ్మెల్యేలు. అందులో 5గురు ఓట్లు వేయలేదని, మరొకరు తప్పుగా వేశారు. 15 ఓట్లతో రాజ్యసభ సీటు ఎలా గెలుస్తామని చంద్రబాబు అనుకున్నారు. సిగ్గు ఉండాలని సుధాకర్ బాబు మండిపడ్డారు. 
 
2018లో రెండు సీట్లు అవకాశం వస్తే సీఎం రమేష్‌ను కొనసాగించారు. జేఆర్‌ పుష్పరాజ్, ఇంకొకరికో ఇవ్వొచ్చు కదా. కానీ ఈరోజు జగన్ ఇచ్చారు. నాలుగు అవకాశాలు వస్తే.. రెండు బీసీలకు  జగన్ ఇచ్చారు. అలా చేయాలంటే గుండె ధైర్యం జగన్‌కు ఉందన్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ, శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన చెందిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు రాజ్యసభ ఎంపీగా జగన్ అవకాశం ఇచ్చారు.

ఇంతవరకు ఆ కులాల నుంచి ఎవ్వరూ రాజ్యసభలోకి అడుగు పెట్టలేదు. ఆలోచించే నాయకుడు వచ్చినప్పుడు.. ఆర్థిక సామాజిక న్యాయం జరుగుతున్నప్పుడు చంద్రబాబు చండాలపు రాజకీయాలు చేస్తున్నారని సుధాకర్ బాబు మండిపడ్డారు. ప్రజల మనసులు చంద్రబాబు గెలవలేరు ఇన్నిసార్లు.. ఇన్ని రాజ్యసభ అవకాశాలు వస్తే.. ఏనాడు వర్ల రామయ్యకు ఇవ్వలేదన్నారు.

గతంలో వారధి మీదకు వర్ల రామయ్య వచ్చినప్పుడు కనకమేడల రవీంద్రకుమార్‌కు అవకాశం ఇచ్చామని ప్రకటించారు. అలిగి వర్ల రామయ్య ఇంట్లో కూర్చుంటే పిలిచి తూతూ మంత్రంగా ఆర్టీసీ ఛైర్మన్‌ చేసి కళ్లు తుడిచే కార్యక్రమం చేశారని సుధాకర్ బాబు తెలిపారు. ఇప్పుడు ఓడిపోయే సీటుకు వర్ల రామయ్యను నిలబెట్టారు. నిలబెట్టి గెలిపించుకునే ఖలేజా, దమ్ము ఉంటే.. నారా లోకేశ్‌ను ఎందుకు పోటీలో నిలబెట్టలేదని సుధాకర్ బాబు ప్రశ్నించారు.

ఇప్పుడు కూడా  ఈరోజు వర్ల రామయ్యకు సాయం చేసే అవకాశం ఉంది. దళితుల ఆత్మగౌరవం నిలబెట్టాలంటే... టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా వర్ల రామయ్యను ప్రకటిస్తే దళితవాదివని కాస్తో కూస్తో నమ్ముతామని సుధాకర్ బాబు అన్నారు. వర్ల రామయ్యకు టీడీపీ జాతీయ అధ్యక్షపదవి కట్టబెట్టాలని సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. 
 
చంద్రబాబు ఎన్ని కుయుక్తి రాజకీయాలు చేసినా, కుట్ర రాజకీయాలు చేసిన దళిత సామాజిక వర్గాల మనస్సు గెలవటం అనేది కుదరదని సుధాకర్ బాబు అన్నారు. జగన్ ఆశీస్సులతో సంతనూతలపాడు ఎమ్మెల్యే అయ్యానని సుధాకర్ బాబు తెలిపారు. దళితవాడల్లోకి చంద్రబాబు అడుగు పెట్టడానికి వీల్లేదని నిషేధం ఉందని సుధాకర్ బాబు మండిపడ్డారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలను ఇంగ్లీషు మీడియానికి దూరం చేయాలని ఎందుకు ఆలోచిస్తున్నావో.. సమాధానం చెప్పే వరకు టీడీపీ వారిని అడుగుపెట్టనివ్వమని సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లీషు మీడియం ప్రాధమిక పాఠశాలల్లో చదివించటానికి అడ్డుపడ్డ వారంతా దీనికి సమాధానం చెప్పాలని సుధాకర్ బాబు డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఎందుకు ఉండకూడదో వ్యతిరేకించిన నాయకులు అంతా సమాధానం చెప్పి రావాలని సుధాకర్ బాబు హెచ్చరించారు. ఒక ఇంగ్లీషు మీడియం, నాడు-నేడు, సున్నా వడ్డీ, ధరల స్థిరీకరణ నిధి నుంచి పొగాకు రైతులకు జగన్ సాయం అందించారు. శనగలు కొనకలేకపోతుంటే ఈరోజు ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా శనగలు కొనిందన్నారు. పొగాకు కొనటానికి సిద్ధపడిందని సుధాకర్ బాబు ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు.
 
గతంలో మహానేత వైయస్‌ఆర్‌ గారి హయాంలో రైతులకు సంపూర్ణ న్యాయం జరిగిందని ..  రుణాలు మాఫీ అయ్యాయి. ఇన్‌పుట్‌ సబ్సిడీ వచ్చిందన్నారు. ఆయన చనిపోతే అలాంటి నాయకుడు రావాలని కోరుకున్నామని సుధాకర్ బాబు అన్నారు. అలా మా హృదయాల్లోంచి పుట్టిన ఒకేఒక్క నాయకుడు వైయస్‌ జగన్ అని సుధాకర్ బాబు అన్నారు.

టీజేఆర్‌ సుధాకర్ బాబు ఏం ఆలోచిస్తారో.. సామాన్య ప్రజలు ఏం ఆలోచిస్తారో  జగన్ కి తెల్సని అన్నారు. కరోనా కష్టకాలంలో పాస్టర్లకు, ఇమాంలకు, పూజారులకు రూ.5వేలు ఇచ్చారు. నేను ఉన్నానని నిలబడిన సీఎం గారికి మద్దతు పలకకుండా కుచ్చిత, నీచ, చండాలపు, బురద రాజకీయాలు చేస్తు్న్న వారిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని సుధాకర్ బాబు మండిపడ్డారు.