కరోనా నియంత్రణ పై శ్రద్ధ ఏది?: చంద్రబాబు విమర్శ
కరోనా నియంత్రణపైన ప్రభుత్వం ఎక్కడ శ్రద్ద చూపడం లేదని ప్రతిపక్షనేత ఎన్.చంద్రబాబునాయుడు విమర్శించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ మొత్తం అంకెల గారడీగా ఉందని, ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రగతి వినాశనానికి దారితీస్తుందని విమర్శించారు.
ఆదాయమార్గాలు ఏమీ చూపకుండా మొత్తం అప్పులనే చూపించారని, దీంతో అభివృద్ది ఎలా సాధ్యమౌతుందని ప్రశ్నించారు. అరకొర కేటాయింపులతో అభివృద్ధి ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని అడిగారు.
అసెంబ్లీ సమావేశాలకు సిఎంతో పాటు మంత్రులు కనీసం మాస్క్‌లు కూడా పెట్టుకోకుండా వచ్చారని, ప్రజలకు ఏం సందేశాన్నిస్తున్నారని ప్రశ్నించారు. పదోతరగతి పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్దులు, తల్లితండ్రుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ, తమిళనాడులో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.