మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 6 జూన్ 2020 (09:59 IST)

జే-టర్న్‌లతో రాష్ట్రం తిరోగమనం: చంద్రబాబు

అన్నింటిలోనూ మీరు తీసుకున్న జే-టర్న్‌లతో రాష్ట్రం కూడా తిరోగమనం పట్టిందని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ప్రకటన విడుదల చేశారు.

‘‘ప్రజలు మీ మాటలు నమ్మి మీ నాయకత్వాన్ని అంగీకరించినప్పుడు, హామీలపై ‘జే-టర్న్‌’ తీసుకుంటే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేపదే మీ నోట వచ్చిన విశ్వసనీయత అనేది ఎక్కడున్నట్టు? ఏడాది కాలంగా రద్దులు, జే-టర్న్‌లు తప్పా మీరు చేసిందేంటీ? ప్రత్యేక హోదా నుంచి అమరావతి వరకు మీరెన్ని చెప్పారు? ఇప్పుడు చేస్తున్నదేమిటీ?

అమలులో ఉన్న 10 పాత పథకాలను రద్దు చేసి, ఆ డబ్బుతో ఒక్క పథకం అమలు చేస్తామనడం మోసం. సన్నబియ్యం, కాళేశ్వరం, 45 ఏళ్లకే పింఛన్‌, ఉద్యోగుల సీపీఎస్‌, కరెంటు చార్జీలు, రైతులకు రూ.3వేల కోట్లతో మార్కెట్‌ స్థిరీకరణ నిధి, యువతకు ఉపాధి... ఇలా అన్నింటిలోనూ మీరు తీసుకున్న జే-టర్న్‌లతో రాష్ట్రం కూడా తిరోగమనం పట్టింది.

ఇకనైనా మాట మీద నిలబడి పాలన చేయండి. ప్రజల జీవితాలను, సమాజాన్ని ప్రభావితం చేసే రాజకీయాల్లో నమ్మకం ముఖ్యం. ప్రజల్లో మన పట్ల ఒక నమ్మకం, భరోసా కలిగాక ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిలబెట్టుకోవాలి. లేదంటే చరిత్రహీనుల్లా మిగిలిపోతాం. ఇది వైసీసీ పాలకులు గ్రహించాలి’’ అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు’’