శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 జూన్ 2020 (17:56 IST)

వైసీపీపై టీడీపీ పైర్..శాసనమండలి వ్యవహారంపై ముప్పేట దాడి

శాసనమండలిలో బుధవారం జరిగిన ఘటనలపై టీడీపీ విరుచుకుపడింది. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్సీల తీరును ఎండగట్టింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, సీనియర్ నేత కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ అశోక్ బాబు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. ఆ వివరాలు యధాతధంగా...
 
ద్రవ్య బిల్లును అడ్డుకున్నది బొత్సా సత్యనారాయణే: కళా వెంకట్రావు
ద్రవ్య బిల్లు మండలిలో ప్రవేశపెట్టడానికి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సిద్దమైనా ఆయనను వెనక్కి లాగి కూర్చోబెట్టింది బొత్సా సత్యనారాయణే.  ద్రవ్య బిల్లు కన్నా రాజధాని బిల్లుకే ప్రాధాన్యత ఇచ్చారు. బడ్జెట్ సమావేశాల్లో ద్రవ్య బిల్లుకు బొత్సా ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు? రాజధాని బిల్లు కోసం ద్రవ్య బిల్లు పాస్ కాకుండా చేయడం వారి స్వార్ధ రాజకీయాలకు నిదర్శనం.

సాంప్రదాయాల గురించి మాట్లాడే అర్హత బొత్సాకు, వైకాపాకు లేదు. అసెంబ్లీలో ప్రతిపక్షనేతకు మాట్లాడే అవకాశం రద్దు చేసి గవర్నర్ తీర్మానం, బడ్జెట్ ఏకపక్షంగా ముగించడం ఏం సాంప్రదాయం? హైకోర్టులో పెండింగ్ లో ఉన్న రాజధాని బిల్లు కరోనా సమయంలో పెట్టడం ఏం సాంప్రదాయం? బడ్జెట్ కోసం 2 రోజుల సమావేశం పెట్టి అగస్మాత్ గా 13 బిల్లులు పెట్టడం ఏం సాంప్రదాయం? 13 బిల్లులు చర్చ లేకుండా శాసనసభలో ఆమోదించడం ఏం సాంప్రదాయం?

మండలిలో ఓటింగ్ అర్హత లేకున్నా 18 మంది మంత్రులు మండలిపై దండ యాత్ర చేయడం ఏం సాంప్రదాయం? 303 మందితో నరేంద్ర మోడీ  ప్రభుత్వం ఏర్పడింది. అయినా రాజ్యసభలో కొన్ని బిల్లులను ఆమోదించకపోయినా మోడీ, మంత్రులు రాజ్యసభపై దండయాత్ర చేయలేదు. రాజ్యసభను గౌరవించారు.

లోకేష్ పై అబద్దాలు మాట్లాడి మంత్రి స్థాయిని దిగజార్చుకోవద్దు. మీరు మాట్లాడేవి నిజమని ధైర్యముంటే మండలి ఫుటేజ్ యదాతధంగా ప్రజలకు చూపాలి. మండలి ప్రసారాలను బంద్ చేయడం ఏం సాంప్రదాయమో బొత్సా చెప్పాలి.
 
నియంతలను మించిన నియంతలా జగన్: కొల్లు రవీంద్ర
రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగ్మోహన్ రెడ్డి దాడులు, దౌర్జన్యాలతో అరాచక పాలన సాగిస్తున్నారు. దేవాలయం లాంటి శాసనసభ, శాసన మండలిని కూడా వీళ్ల అరాచకాలకు బలి చేస్తున్నారు. చట్టసభల్లో నిన్న మంత్రులు వ్యవహరించిన తీరును చూసి ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు.

ద్రవ్యవినిమయ బిల్లుకు సంబంధించి చర్చ  సమయంలో 18 మంది మంత్రులు శాసన మండలికి వచ్చి రాద్దాంతం చేశారు. ఇప్పటికే సెలెక్ట్ కమిటీ వద్ద, కోర్టుల్లో ఉన్న అంశాలపై మండలిలో చర్చ చేపట్టాలని మంత్రులు పట్టుబట్టడం దుర్మార్గం కాదా?

స్థానిక సంస్థల పాలనకు ఇబ్బంది లేకుండా ద్రవ్యవిమయ బిల్లు ప్రవేశపెట్టండి మేం ఆమోదిస్తామని ప్రటిపక్షం చెబితే.. అలా కాదు సెలెక్ట్ కమిటీ వద్దనున్న బిల్లుల గురించి మంత్రులు పట్టుబట్టడం వారి నియతృత్వ విధానానికి, నిరంకుశ రాజకీయవాదానికి నిదర్శనం కాదా.? అసలు మంత్రులే పోడియం చుట్టుముట్టడం దేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా.? 

రౌడీల్లా, గూండాల్లా వ్యవహరించిన మంత్రుల్ని స్వాతంత్ర్య భారత దేశంలో ఏ రాష్ట్రమూ చూసి ఉండదు. తొడకొట్టడం, మీసాలు మెలేయడం, ప్యాంట్ జిప్ తెరవడం వంటి ఘటనలు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. మహిళా సభ్యులు ఉన్నారని కూడా చూడకుండా ఇలానా మంత్రులు వ్యవహరించేది.? నారా లోకేశ్, బీద రవిచంద్ర, సత్యనారాయణన రాజుపై దాడికి దిగి.. ఇప్పుడు ఎదురు దాడి చేస్తున్నారు.

టీడీపీ నేతలే దాడి చేస్తే అందుకు సంబంధించిన  వీడియోలు బయటపెట్టండి. టీడీపీ నేతలు తప్పు చేస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకోండి. నియమనిబంధనల ప్రకారం నడచుకోవాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సూచిస్తే.. దాన్ని కూడా తప్పుబడుతున్నారు.

టీడీపీ నేతలు అడ్డు పడ్డారు, వారికి జీతాలివ్వలేకపోతున్నామని మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జగన్ ఫ్యాక్షన్ సంస్కృతికి అద్దం పడుతోంది. జగ్మోహన్ రెడ్డి పాలన నియంతలే నిష్టురపోయేలా ఉంది. 

తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేశారంటున్న వైసీపీ నేతలు.. మండలి సమావేశాలకు సంబంధించిన వీడియోలను ఎందుకు బయటకు రాకుండా అడ్డుకున్నారు.? మీరు నిజాయితీగా ఉంటే కౌన్సిల్ సమావేశాలకు సంబంధించిన వీడియోలను బయటపెట్టండి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి బలహీన వర్గాలను అణచివేయడమే ధ్యేయంగా వ్యవహరిస్తోంది.

అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడిపై కేసులే. సర్జరీ చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్న వ్యక్తిని 600 కి.మీలు రోడ్డు మార్గంలో తీసుకెళ్లడంతో మరోసారి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. దీనికి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు.? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో అయ్యన్న పాత్రుడిని వేధిస్తున్నారు.

నిర్భయ చట్టం ప్రకారం కేసు పెట్టడం జగన్ నియంతృత్వ విధానం కాదా.? యనమల రామకృష్ణుడు గారిపై శాసన మండలి వేధికగా దాడికి యత్నించారు. బీసీలు గత రెండున్నర దశాబ్దాలుగా అనుభవిస్తున్న 34శాతం రిజర్వేషన్లను కుట్ర పూరితంగా 24శాతానికి కుందించారు. ఫలితంగా సుమారు 16వేల మందికి రాజకీయ ప్రాధాన్యం లేకుండా చేశారు.

గత ఏడాది కాలంగా బీసీ కార్పొరేషన్ నుండి రుణాలు నిలిపేశారు. ఆదరణ పథకం నిలిపివేశారు. ఆర్ధిక స్వావలంబన కల్పించే పథకాలను రద్దు చేశారు. కార్పొరేషన్ల నిధుల్ని నవరత్నాలకు మళ్లించి ద్రోహం చేస్తున్నారు. కంకణం కట్టుకుని మరీ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తూ.. వారికి ఏదో మేలు చేస్తున్నమని చెప్పుకుంటూ మోసం చేస్తున్నారు.

139 కులాలకు139 కార్పొరేషన్లు పెడతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఏడాదిలో ఏం చేశారు.?
ఏడాది కాలంగా వైసీపీ నేతలు చేస్తున్న దోపిడీలు, దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారు. ఆయా విషయాల నుండి, కోర్టుల్లో పడుతున్న మొట్టికాయల నుండి ప్రజల ఆలోచనలను మరల్చేందుకు అచ్చెన్నాయుడి అరెస్టు నుండి శాసన మండలిలో రాద్దాంతం వరకు అన్ని విషయాల్లో డైవర్ట్ పాలిటిక్స్ కు తెరలేపారు.

ఇది జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ మనస్థత్వానికి నిదర్శనం. మంత్రుల అనైతిక విధానాలకు నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరపడ్డాయి. ప్రభుత్వ అరాచకాలకు, రాజధాని ఆడపడుచుల కన్నీళ్లలో, ప్రజల ఆక్రందనల్లో ప్రభుత్వం కొట్టుకుపోయే రోజు త్వరలోనే ఉంది.
 
ధైర్యం ఉంటే మండలి వీడియో పూటేజీలను బయటపెట్టాలి: అశోక్ బాబు
ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎటుపోతుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారని శాసనమండలి సభ్యులు అశోక్ బాబు అన్నారు. బుధవారం శాసనమండలిలో చోటు చేసుకున్న పరిణామాలపై తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించిన అశోక్ బాబు మాట్లాడుతూ.. కరోనాతో సహజీవనం చేయాలని మాట్లాడిన ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులకు ఎందుకు కుదించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

బడ్జట్ ను ఆమోదించాల్సిన రాజ్యాంగ బాధ్యత రెండు సభలపై ఉంది. కానీ వైకాపా శాసన సభే కీలకం అన్నట్లు వ్యవహరిస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, బిల్లులపై చర్చించే అవకాశం లేకపోవడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం ఎటుపోతుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు.

ఆర్టికల్ 197 ప్రకారం అప్రాప్రియేషన్ బిల్లు ను తిరస్కరించే అవకాశం లేదు. కరోనా పేరుతో శాసనసభ కు సంబంధించిన అనేక రూల్స్ ను తుంగలో తొక్కిన ఈ ప్రభుత్వం ద్రవ్యవినిమయ బిల్లు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం ప్రజలు గమనించారని అన్నారు. గతంలో వికేంద్రీకరణ, సీఆర్.డి.ఏ బిల్లులను సెలక్ట్ కమిటీకి మండలి సభ్యులు పంపినప్పుడు సెక్రటరీ ఏ విధంగా వాటిని ఆపుతారని, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? అని ప్రశ్నించారు.

వైకాపా వాళ్లకు బడ్జట్ కంటే అమరావతి తరలింపు, సీ.ఆర్.డి.ఏ బిల్లులే ముఖ్యంలా ఉన్నాయని అన్నారు. వైకానా మంత్రుల భాష, మంత్రులు ప్యాంటు జిప్పులు తీసి చూపించిన విధానం చూసి ఇటువంటి వాళ్లు మినిస్టర్లు గా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు.

బిల్లులపై చర్చించేందుకే రూల్ 91 ను అమలు చేయాలని చెప్పామని, అప్రాప్రియేషన్ బిల్లు ఆగిపోతే జీతాలు ఆగిపోతాయని యనమల రామకృష్ణుడు 1000 సార్లు చెప్పారని అయినా మంత్రులు లెక్కచేయలేదని చెప్పారు. లోకేష్ బాబుపై దాడి చేయడానికి మంత్రి ప్రయత్నించారు కాబట్టే ఆయన మా సీట్ల దగ్గరకు వచ్చారన్నారు. వైకాపాకు ధైర్యం ఉంటే మండలి వీడియో పూటేజీలను ప్రజల ముందు పెట్టాలని సవాల్ విసిరారు.