మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 జూన్ 2020 (17:32 IST)

చంద్రబాబు ఆరోగ్యభద్రతను దృష్టిలో పెట్టుకునే రెండు రోజుల సమావేశాలు: మంత్రి అనిల్

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించనివ్వకుండా ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకోవడం ద్వారా కౌన్సిల్ లో తెలుగుదేశం కుట్రపూరితంగా వ్యవహరించిందని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.

తాడేపల్లిలోని వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కౌన్సిల్ లో టీడీపీకి సంఖ్యాబలం వుంది కాబట్టి ప్రభుత్వ బిల్లులను అడ్డుకుంటాం.. ఏమైనా చేస్తామనే తీరుగా టిడిపి సభ్యులు వ్యవహరించాని అన్నారు.

మేం ఏది చెబితే అదే శాసనం, సభాసంప్రదాయాలను కొత్తగా మొదలు పెడతామని అత్యంత దారుణంగా టిడిపి ప్రవర్తించిందని విమర్శించారు. కోవిడ్ -19 కారణంగా బడ్జెట్ సమావేశాలను తక్కువ సమయంలోనే పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం భావించింది. డెబ్బై ఏళ్లకు పైబడిన ప్రతిపక్ష నేత చంద్రబాబు  ఆరోగ్యభద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని రెండు రోజుల్లో ఈ సమావేశాలను ముగించాలని నిర్ణయించామని అన్నారు.

ఈ మేరకు బిఎసిలో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సాధారణంగా ప్రభుత్వ బిల్లులు అన్ని పూర్తయిన తరువాత ద్రవ్య వినిమయ బిల్లును ఆఖరులో సభలో పెట్టి ఆమోదించుకోవడం సంప్రదాయంగా వస్తోందని అన్నారు.

అదే విధంగా కౌన్సిల్ లో ప్రభుత్వ బిల్లులను చర్చించిన తరువాత ఆఖరులో ద్రవ్య వినిమయ బిల్లును చర్చిద్దామని మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బుగ్గన రాజేంద్రనాద్‌, బొత్స సత్యనారాయణలు చైర్ లో వున్న డిప్యూటీ చైర్మన్ ను కోరారని తెలిపారు.

అయితే మాకు సంఖ్యాబలం వుందనే పేరుతో ఈ సంప్రదాయాన్ని కూడా పక్కకు పెట్టి, మేం చెప్పిందే శాసనం, అలాగే జరగాలనే లక్ష్యంతో టిడిపి ప్రయత్నించిందని అన్నారు. పాత సంప్రదాయాలను మారుస్తూ... ఈ రోజు నుంచి... ఇక్కడి నుంచే కొత్త సంప్రదాయాలు ప్రారంభమవుతాయని సభలో చెప్పడం అత్యంత దారుణమని అన్నారు.

మేం ప్రభుత్వ బిల్లులను అడ్డుకుంటాం...మేం అనుకుంటే విద్వంసం సృష్టిస్తామని టిడిపి సభానాయకుడు యనమల రామకృష్ణుడు కౌన్సిల్ లో మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు.  

ప్రభుత్వం బిల్లులను అడ్డుకునేందుకు నిబంధనలకు విరుద్దంగా రూల్ 90 నోటీస్ పేరుతో యనమల రామకృష్ణుడు వ్యవహరించిన తీరు, దానిని చైర్మన్ స్థానంలో వున్న వారు ఆమోదించడం దారుణమని అన్నారు. రూల్ 94 ప్రకారం ఒకరోజు ముందుగా నోటీస్ ఇవ్వాలని చెబుతున్నా కూడా, యనమల ఇచ్చిన నోటీస్ ను చైర్మన్ అడ్మిట్ అని సంతకం చేశారని చెప్పి డిప్యూటీ చైర్మన్ పరిగణలోకి తీసుకోవడం సమంజసమా అని ప్రశ్నించారు.

సభలోని బిజెపి, పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ల అభిప్రాయాలను తెలుసుకుని అయనా నిర్ణయం తీసుకోవాలని చైర్మన్ స్థానంలో వున్న డిప్యూటీ చైర్మన్ కు పదేపదే విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు.

చివరికి చైర్మన్ స్థానంలో కూర్చుకున్నవారు కూడా తనకు ప్రభుత్వం సదుపాయాలను తీసేసిందంటూ, తమ వ్యక్తిగత కక్షలను చాటుకునే ప్రయత్నం చేశారని అన్నారు. తమకు సంఖ్యాబలం వుందని సభలో ప్రభుత్వ బిల్లులను బుల్ డోజ్ చేస్తారా అని ప్రశ్నించారు.

గడ్డం పెంచుకుని మంత్రులు రౌడీయిజం చేస్తున్నారని సభలో టిడిపి ఎమ్మెల్సీలు తనను ఉద్దేశించి విమర్శలు చేశారని మంత్రి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గడ్డం పెంచుకున్న వారందరూ రౌడీలా...? ఇదే సభలో పెద్దలు చైర్మన్ కూడా గడ్డం పెంచుకున్నారు, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సైతం గడ్డం వుంది ఆయన కూడా రౌడీనా అని నేను సభలో ప్రశ్నించానని అన్నారు.

దానిని వక్రీకరిస్తూ చైర్మన్ షరీఫ్‌ గడ్డం గురించి మాట్లాడటం ముస్లీంల మనోభావాలను కించపరచడమేనని, ఆయనను రౌడీ అని అంటారా అంటూ టిడిపి తనకు అనుకూలమైన ఎల్లో మీడియాలో నాపైన కథనాలు రాయించారని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
గత కౌన్సిల్ లో నాపైన బెట్టింగ్ ఆరోపణలు చేసిన టిడిపి తరువాత దానిని కనీసం నిరూపించలేక పోయిందని గుర్త చేశారు. తిరిగి నాపైన మరోసారి బురదజల్లేందుకు టిడిపి ప్రయత్నిస్తోందని అన్నారు. తాను అసభ్యంగా, మహిళలు ఇబ్బందిపడేలా కౌన్సిల్ లో వ్యవహరించారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

కార్మికుల సొమ్మును రూ.151 కోట్లు దిగమింగిన అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే... బిసిలపై దాడి అంటూ టిడిపి గగ్గోలు పెట్టిందని, ఇప్పుడు ఒక బిసి నాయకుడిగా వున్న నాపైన బెట్టింగ్ ఆరోపణలు, అసభ్యంగా వ్యవహరించానని, గడ్డం పెంచి రౌడీయిజం చేస్తున్నానని ఎలా తప్పుడు ఆరోపణలతో దాడి చేస్తున్నారని ప్రశ్నించారు.

నేను మాత్రం బిసిని కానా? ఒక్క అచ్చెన్నాయుడు మాత్రమే బిసినా అని నిలదీశారు. నేను అసభ్యంగా ప్రవర్తించానని ఆరోపిస్తున్న లోకేష్ చౌదరి, రాజేంద్రప్రసాద్ చౌదరి, అశోక్ బాబు, దీపక్ రెడ్డిలు దానిని నిరూపించాలని సవాల్ చేశారు. చైర్మన్ ఛాంబర్ కు అందరం వెడదామని, సభలో రికార్డులను, వీడియోలను పరిశీలించి నిజాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

నిరూపించలేకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తున్నామనే లేఖలతో టిడిపి ఎమ్మెల్సీలు రాజేంద్రప్రసాద్ చౌదరి, లోకేష్ చౌదరి, దీపక్ రెడ్డి,అశోక్ బాబులు రావాలని డిమాండ్ చేశారు. మీరు నిరూపిస్తే ఎటువంటి శిక్షకు అయినా సిద్దమని స్పష్టం చేశారు.