శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (14:14 IST)

నిమ్మగడ్డ చంద్రబాబు మనిషే: అంబటి రాంబాబు

కాపు నేస్తం అనే పథకాన్ని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాపు నేస్తం పథకం వల్ల 2,35,873 మంది అర్హులైన కాపు మహిళలు ఒక్కొక్కరికి ప్రతి ఏటా రూ.15,000 అందజేస్తారన్నారు.

నిరుపేద కాపు మహిళలు ఎవరైతే 45 ఏళ్లు పైబడి, 60 ఏళ్లు లోపు ఉన్నవారికి ఐదేళ్లలో రూ.75,000 అందజేయటం జరుగుతుందని అంబటి రాంబాబు తెలిపారు. ఈ ఏడాది రూ.15,000లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారని అంబటి రాంబాబు అన్నారు. ఇది కాపు మహిళలకు సంబంధించిన పథకమని అంబటి తెలిపారు. 

రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి అనే కులాలు కాపు కులంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ సామాజిక వర్గం చాలా వెనుకబడిందని దీంట్లో చిన్న చిన్న కమతాలు ఉన్న రైతులు, రైతు కూలీలు, తాపీ మేస్త్రీలు, ఆటో డ్రైవర్లు, రిక్షా తొక్కుకొని బ్రతికేవారు, కూలీనాలీ చేసే అత్యధిక సంఖ్య ఉన్న కులం ఇదన్నారు. రాయలసీమ నుంచి శ్రీకాకుళం వరకు ఈ కులం ఉందన్నారు. వెనుకబడిన ఈ కులం సంక్షేమం కోసం కోరుకుంటున్నారని అంబటి తెలిపారు.

ప్రతి ప్రభుత్వమూ, ప్రతి రాజకీయ పార్టీ వీరిని ఉపయోగించుకున్నది తప్ప చిత్తశుద్దితో పనిచేసిన ప్రభుత్వం ఇంతవరకు లేదనే చెప్పాలని అంబటి రాంబాబు తెలిపారు. గత ప్రభుత్వం చంద్రబాబు ఈ కులాన్ని మోసం చేసిన తీరు చూస్తే బాధకలుగుతుందని అంబటి అన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ఈ కులాన్ని ఆకర్షించటం కోసం చంద్రబాబు అసాధ్యమైన వాగ్ధానాలు చేసి ఐదేళ్ల పాటు వారి సంక్షేమానికి ఉపయోగపడకపోగా, ఈ కులం పట్ల ఒక రాక్షస స్వభావంతో చంద్రబాబు, టీడీపీ పనిచేయటం జరిగిందని అంబటి మండిపడ్డారు. 
 
ఐదేళ్లలో ఐదువేల కోట్ల అని చంద్రబాబు మోసం చేశారు:
చంద్రబాబు సంవత్సరానికి రూ.వెయ్యి కోట్లు ఇచ్చి.. ఐదేళ్లలో రూ.ఐదువేల కోట్లు కాపు, తెలగ, బలిజ, ఒంటరి సంక్షేమానికి ఖర్చు చేస్తామని వాగ్దానం చేశారు. వాగ్ధానం చేసి చివరకు ఎన్నికల ముందు ఎంత ఖర్చు చేశారంటే.. రూ.2,000 కోట్లు లోపే ఖర్చు చేసి కాపులను గత ప్రభుత్వం మోసం చేసింది.

అనేక సందర్భాల్లో కాపులపై కేసులు పెట్టారు. జైళ్లలో పెట్టారు. అనేక రకాలుగా కాపులను వేధించారు. ఆ రకంగా కాపుల పాలిట చంద్రబాబు ప్రభుత్వం రాక్షసత్వంతో వ్యవహరించింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అంబటి అన్నారు.
 
ఎన్నికల సమయంలో, పాదయాత్రలో ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకున్నారు:
కాపుల పట్ల ఎన్నికల సమయంలో, పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి వాగ్ధానం చేశారని అంబటి గుర్తు చేశారు. కాపులు పేద వర్గానికి చెందినవారని రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు గడుపుతున్న కాపు సోదరులకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఐదేళ్ల కాలంలో రూ.10,000 కోట్లు ఖర్చు చేసి వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని జగన్‌ వాగ్ధానం చేశారు. ఇప్పటికి 13 మాసాలు ఈ ప్రభుత్వ పాలన సాగిందని ఇప్పటికే కాపుల సంక్షేమానికి రూ.4,769.46 కోట్లు ఖర్చు చేయటం జరిగిందని అంబటి రాంబాబు తెలిపారు. 
 
ఏడాదిలో 3.90 కోట్ల మందికి రూ.43,000 కోట్ల సంక్షేమం:
చంద్రబాబు ఐదేళ్ల కాలంలో దీంట్లో సగం కూడా ఖర్చు చేయలేదు. కేవలం ఒక్క ఏడాదిలోనే.. రూ.4,769.46 కోట్లు కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేయటం జరిగిందన్నారు. ఈ 13 నెలల్లోనే 22,89,319 మంది కాపు లబ్ధిదారులకు సహాయం చేయటం జరిగిందని ఇది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ద్వారా కాపులను అభివృద్ధి పరిచే ప్రభుత్వమని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

కాపులకు చేదోడువాదోడుగా ఉండేందుకు సీఎం జగన్ కాపు నేస్తం ప్రారంభించిన సందర్భంలో దీన్ని అందరూ స్వాగతించాలని అంబటి రాంబాబు కోరారు. కాపు సోదరులు అందరూ.. చెప్పిన దానికన్నా మిన్నగా రూ.2000 కోట్లు ఖర్చు చేస్తామని రూ.4,769 కోట్లు పైచిలుకు ఖర్చు చేశారు. కాపు మహిళలు పాడిపంట, పొలం పనులు చేసే వారు కూడా ఉన్నారు. వారు అందరి ఖాతాల్లోకి రూ.15,000లు నేరుగా వెళ్లేలా చేశారు.

మధ్యలో మధ్యవర్తులు ఎవ్వరు లేకుండా సంక్షేమ పధకాలు అందించాలని జగన్ మోహన్ రెడ్డి రూ.354 కోట్లు కాపు మహిళలకు చేయూతగా ఇచ్చారు. ఈ 13 మాసాల్లో కాపులకే కాదు.. 3.90 కోట్ల మందికి సీఎం జగన్ మోహన్ రెడ్డి రూ.43,000 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అందించారని అంబటి గుర్తు చేశారు. 
 
కాపుల సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తున్నది సీఎం వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాపుల సంక్షేమం పెరగాలని, వారి చేదోడువాదోడుగా ఉండాలని కోట్లాది రూపాయలను జగన్ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని అంబటి అన్నారు. ఈ రోజు కాపు నేస్తం ప్రారంభోత్సవంగా కాపుల తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అంబటి రాంబాబు అన్నారు. ఇంతకుముందు ఏ ప్రభుత్వమూ చేయని ఘనకార్యాన్ని చేసినందుకు సంతోషంగా ఉందని అంబటి రాంబాబు తెలిపారు. 
 
నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోరు ఎందుకు విప్పరు?:
ఈ నెల 13న పార్క్ హయత్‌లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిశారు. ఆ వ్యక్తులు నిమ్మగడ్డ రమేష్ కుమార్, యలమంచలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి), కామినేని శ్రీనివాస్ అని అంబటి అన్నారు. ఆ ముగ్గురు కలిసి రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో ఏం మాట్లాడుకున్నారో ఎవ్వరూ చెప్పలేదు. దీనిపై ఇంతవరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ బయటకు రాలేదు.

కానీ మిగిలిన ఇద్దరు బయటకు వచ్చి ఇది రహస్య సమావేశం కాదు బహిర్గత సమావేశమే అని ఒప్పుకుంటున్నారు. అయితే.. 13న నుంచి నిన్న సీసీ పుటేజీ రిలీజ్ అయ్యేవరకు వారేమీ చెప్పలేదని అంబటి తెలిపారు. సీసీ పుటేజీ రిలీజ్ అయ్యాక ఏం రమేష్ కుమార్‌తో కలిస్తే తప్పేంటని హోటల్‌లో కలిశాం అంటున్నారు. అలా కాకుండా.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు నాయుడు నియమించిన వ్యక్తి.

అతను మా మనిషి. మా వాడు. మేం కలిశాం. మేం ఏం చెబితే అది చేయటానికి నిమ్మగడ్డ సిద్ధంగా ఉన్నారని సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ చెప్పండని అంబటి సవాల్ విసిరారు. చంద్రబాబు పంపిస్తేనే కలిశామని చెప్పండి. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ కోసం కోట్లు ఖర్చు పెట్టి అయినా ఆయన్ను ఎస్‌ఈసీగా నియమించేలా మంచి మంచి ప్లీడర్లు పెట్టి వాదనలు చేయిస్తామని చెప్పండి. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డను తయారు చేస్తామని చెప్పండని అంబటి అన్నారు. అలా చెబితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీకు మీకు సత్సంబంధాలు ఉంటే అని అంబటి తెలిపారు.
 
నిమ్మగడ్డ చంద్రబాబు మనిషే అని మొదటి నుంచి చెబుతున్నాం
మేం మొట్టమొదటి నుంచి చెబుతున్నది చంద్రబాబు నియమించింది మీ వ్యక్తి. మీ వాడు.. ఎస్‌ఈసీగా ఉండి ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారు అనే కదా మేం చెబుతున్నది. దాన్ని అంగీకరించే పరిస్థితికి మీరు వచ్చారు. దీంట్లో సందేహం ఏముంది? ఇదంతా జరుగుతుంటే టీడీపీ నుంచి ఒకాయన బయటకు వచ్చి.. కలిస్తే తప్పేంటని అంటున్నారు. బరి తెగించారు. కలిస్తే తప్పేంటని అంటున్నారు. హైకోర్టు జడ్జి వచ్చి మిమ్మల్ని కలిస్తే తప్పు కాదా?

దానికి తోడు టీడీపీకి వత్తాసు పలికే పత్రికలు రెండు ఉన్నాయి. ఆ రెండు మొదటి పేజీలో వార్తే కాదన్నట్లు వేయరు. మాట్లాడరు. ఎస్‌ఈసీ వెళ్లి ఇద్దరు బీజేపీ వారితో కలిస్తే.. బీజేపీ అధిష్టానం సీరియస్ అయిందన్నట్లు పత్రికల్లో చదివానని అంబటి తెలిపారు. వీరు దొంగలు, బీజేపీ యోగక్షేమాల కోసం పాటు పడే వ్యక్తులు కాదని.. చంద్రబాబు యోగక్షేమాల కోసం పోరాడే వ్యక్తులు.

బీజేపీ ముసుగులో ఉండి అన్ని అనైతిక పనులు చేస్తున్నారని వీరిపట్ల కాస్త కనిపెట్టి ఉండకపోతే ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని క్రమశిక్షణ ఉన్న పార్టీగా బీజేపీని చెప్పుకుంటున్నారు. బ్యాంకులకు డబ్బులు ఎగవేసిన క్రమశిక్షణ లేని వ్యక్తులను నమ్మి బీజేపీ రాజకీయాలు చేస్తే.. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను పట్టుకొని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసే పరిస్థితి ఉంటుందని బీజేపీ కాస్త జాగ్రత్తగా ఉంటే బావుంటుందని ఈ ఉచిత సలహా నచ్చితే తీసుకోండి.. లేకపోతే లేదని అంబటి రాంబాబు అన్నారు. 
 
నిమ్మగడ్డను కలవటమే కాకుండా బరితెగించి మాట్లాడుతుంటే ఏమనాలి?
వీరంతా టీడీపీ యోగక్షేమాల కోసం ప్రయత్నం చేసే వ్యక్తులే. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంట్లోకి వెళ్లి మాట్లాడండి. ఎవరు కాదన్నారని అంబటి ప్రశ్నించారు. తప్పేంటి? చంద్రబాబు ఇంట్లోకి వెళ్లి మా వోడు అండి. మమ్మల్ని నియమించారు. వెళ్తాం.. అంటే మాకేం అభ్యంతరం లేదని అంబటి అన్నారు. లోకేశ్ బాబుతోనూ వెళ్లి మాట్లాడమనండి. బరితెగించినట్లు మాట్లాడుతున్నారు. కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి మాట్లాడారు.

ఎస్‌ఈసీగా ఉన్నాను అని చెప్పుకుంటున్న వ్యక్తి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి నిన్నటి కలయిక మీద ఎందుకు నోరు విప్పటం లేదు. యోగక్షేమాలు మాట్లాడుకున్నారా? కుటుంబ వ్యవహారాలు ఏమైనా మాట్లాడుకున్నారా? దొరికిపోయారు కాబట్టి మేం దొంగలం కాదు.. బహిరంగంగానే మాట్లాడుతున్నాం.. కలిస్తే.. హోటల్‌లో ఎందుకు కలుస్తాం.

గెస్ట్ హౌస్‌లో కలుస్తాం అని చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని అంబటి మండిపడ్డారు.  మీరు ఒక కుట్ర పూరితంగా కలిశారని.. ఇది అనైతికమైనది, అధర్మమైనది దీనికి మూల్యం చెల్లించకతప్పదని అంబటి రాంబాబు హెచ్చరించారు.