శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 21 జులై 2021 (19:57 IST)

జగన్ ఎందుకు మట్లాడరు?: ఎంవీ.మైసూరారెడ్డి

రాయలసీమ ఏపీలో అంతర్భాగమా కాదో సీఎం జగన్ చెప్పాలని, నీటి ప్రాజక్టులపై కేంద్రం గెజిట్ గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలి పెట్టు అని మాజీ మంత్రి, రాయలసీమ నేత డాక్టర్ ఎంవీ.మైసూరారెడ్డి అన్నారు. గెజిట్‌ను స్వాగతించే ముందు ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఆలోచన చేయలేదని అన్నారు.

రాయలసీమను జగన్ చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రుల తీరు వలన రెండు రాష్ట్రాలకు నష్టం కలుగుతోందని తెలిపారు. పోలవరంపై ఐదు రాష్ట్రల ముఖ్యమంత్రులు కలసి మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు సీఎం‌లు మాట్లాడుకోలేరా? అని వ్యాఖ్యానించారు.

శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికి మూడు టీఎంసీలు మాత్రమే వినియోగించాలని, ఇష్టానుసారం విద్యుత్ ఉత్పత్తి చేస్తోంటే సీఎం జగన్ ఎందుకు మట్లాడరని మైసూరారెడ్డి ప్రశ్నించారు. రాయలసీమ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం చట్టబద్దత కల్పించాలని మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు.

పట్టిసీమ ప్రాజెక్టుకు చట్టబద్దత కల్పించాలని ప్రతిపక్షనేతగా జగన్ డిమాండ్ చేసింది నిజం కాదా? అని అడిగారు. గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రభుత్వం ఉండుంటే.. రాయలసీమ ప్రజలకు ఇంత అన్యాయం జరిగేది కాదు కదా అని అన్నారు. కేసీఆర్, జగన్ లు రాజకీయ లబ్ది కోసం కీచులాడుకుని  జట్టును కేంద్రం చేతిలో పెట్టారని వ్యాఖ్యానించారు.

ఇద్దరు సీఎంలు కలిసి మాట్లాడుకోకపోవటం వలనే బోర్డులు మితిమీరి జోక్యం చేసుకున్నాయన్నారు. శ్రీశైలం జలాశయాన్ని తెలంగాణ ఖాళీ చేస్తుంటే ఆంధ్రా పాలకులు నిద్ర పోతున్నారని మైసూరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.