హోదా విషయంలో జగన్ ఇంకా ఎందుకు మభ్యపెడుతున్నారు? సీపీఐ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇంకా ఎందుకు మభ్యపెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. 25 మంది వైసీపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానన్నారని, 22 మంది ఎంపీలను గెలిపించినప్పటికీ ప్రత్యేక హోదాపై దృష్టి పెట్టలేదని ఆయన తప్పుబట్టారు.
ఇప్పుడు బీజేపీకి మెజార్టీ ఉంది కాబట్టి హోదా అడగలేకపోతున్నామంటున్నారని పేర్కొన్నారు. రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేదన్న విషయం మీకు తెలియదా? అని ప్రశ్నించారు.
సీఏఏ, ఎన్‌ఆర్సీకి మద్దతిచ్చినప్పుడు ప్రత్యేకహోదా ఎందుకు డిమాండ్ చేయలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో మీ మద్దతు తీసుకునే ప్రభుత్వమే వస్తుందని ఎలా చెప్పగలరు? అని రామకృష్ణ మరోసారి ప్రశ్నించారు.
తక్షణమే హ్యూమన్ రైట్స్ కమిషన్‌ను ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్‌లో తక్షణమే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను 4 నెలల్లోగా ఏర్పాటు చేయమని గత అక్టోబర్‌లో హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పటికి 7 నెలలు కావస్తున్నా కమిషన్ ఏర్పాటు చేయకపోవడం హైకోర్టు ధిక్కరణకాదా? అని రామకృష్ణ ప్రశ్నించారు.
మానవ హక్కులకు భంగం వాటిల్లిన పలు సందర్భాలలో, కరోనా విపత్తు నేపథ్యంలో పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
ప్రజలకు మానవ హక్కుల కమిషన్ ఎంతో బాసటగా ఉండేదన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటికీ రాష్ట్రంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం విచారకరమని రామకృష్ణ పేర్కొన్నారు.