మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 28 మే 2020 (08:26 IST)

జగన్‌ ది విధ్వంసక పాలన: చంద్రబాబు ధ్వజం

ఏపీలో జగన్ విధ్వంసకరమైన పాలన సాగిస్తున్నారని నారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మహానాడు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక నష్టంవచ్చినా, ప్రాణాపాయం బెదిరింపులు వచ్చినా, ప్రలోభాలకు గురిచేసినా.. లొంగకుండా ఉంటున్న కార్యకర్తలందరికీ పాదాభివందనాలు చేస్తున్నానని అన్నారు
 
‘‘ప్రజలసొత్తు అయిన ప్రజావేదిక కూల్చివేతతో తన విధ్వంసక పాలనను జగన్‌ ప్రారంభించారు. అమరావతి కోసం పైసా తీసుకోకుండా వేల ఎకరాల భూములిచ్చిన రైతులను కరోనా సమయంలోను రోడ్డుపై పడేశారు. వాళ్లు రోడ్డుపై పడి పోరాడుతుంటే జగన్‌ పైశాచికానందం పొందుతున్నారు. 72శాతం పూర్తిచేసిన  పోలవరాన్ని...2019 డి సెంబరుకు పూర్తికావాల్సిన దాన్ని నిలిపివేశారు.

కాంట్రాక్టరును మార్చవద్దంటే వినలేదు. తమకు కావాల్సిన  వాళ్లకు ఇచ్చుకుని పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలీని పరిస్థితి తెచ్చారు. దళిత డాక్టర్‌ సుధాకర్‌ మాస్కులిమ్మని అడిగితే దాడిచేసి..పిచ్చివాడనే ముద్రవేసే ప్రయత్నం చేశారు. ఇంకెవరూ మాట్లాడకుండా ఉండాలనే ఈ దారుణం!

మరోవైపు ఏడాదికాలంలో రాష్ట్రంలో 36 సంక్షేమ పథకాలను రద్దుచేశారు. అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమా, నిరుద్యోగ భృతి, పండుగ కానుకలు అన్నీ రద్దుచేశారు. పైగా ఏడాదిలో రూ.80వేల కోట్ల అప్పులు తెచ్చారు. రూ.50వేల కోట్ల అదనపు పన్నులు విధించారు. విద్యుత్‌ చార్జీలు, ఇసుక, మద్యం, రిజిస్ర్టేషన్‌ చార్జీలు పెంచారు. మద్యం నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు అవినీతి సాగిస్తున్నారు.

‘దోచుకో...దాచుకో’ అన్న విధానంలో సాగుతున్నారు. రూ.16లక్షల కోట్లు రాష్ట్రానికి పెట్టుబడులుగా తెచ్చాం. రైతు భరోసాతో ఎకరాకు రూ.12,500 ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ రైతులకు ఇస్తోంది 7,500 మాత్రమే. తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే కరోనాను సమర్థంగా కట్టడి చేసేవాళ్లం. బ్లీచింగ్‌ వేస్తే చాలు, పారాసిటమాల్‌ వాడితే సరిపోతుందంటూ అవగాహన లేని మాటలు చెప్పి ముఖ్యమంత్రి నవ్వులపాలు అయ్యారు.

నాసిరకం మద్యం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. భూముల్లో, గనుల్లో దోపిడీలకు పాల్పడ్డారు. సింహాచలం భూములపై కన్నేశారు. రాజమండ్రిలో ఆవ భూముల్లో అవినీతి చేశారు. గుడివాడలో మంత్రి స్వయంగా భూములిచ్చేయాలంటూ బెదిరిస్తున్నారు. దుర్గమ్మ గుడిలో, శ్రీశైలంలో అవినీతి బయటపడింది.

ఆస్తులు అమ్మేస్తున్నారు. అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు? వ్యాపారాలు చేయాలంటే సమర్పించుకోవాల్సిందేనంటూ బెదిరించి, వసూళ్లు చేస్తున్నారు. కరోనా వల్ల ఎన్నికలు ఆపేస్తే...ఎన్నికల అధికారిని తొలగిస్తారా? రాజధాని తరలింపు అంశంపై సెలక్ట్‌ కమిటీ వేయమన్నందుకు శాసనమండలి రద్దు తీర్మానం చేస్తారా? చైర్మన్‌ చెప్పింది మండలి కార్యదర్శి చేయరా? 
 
కరోనా కాలంలో పింఛనర్లు, ఉద్యోగులకు జీతాల్లో 50శాతం కోత విధించారు. కాంట్రాక్టర్లకు మాత్రం వేలకోట్ల బిల్లులు చెల్లించారు. దళిత నేత హర్షకుమార్‌ను 50రోజులు జైల్లో ఉంచారు. ఎల్జీ పాలిమర్స్‌పై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారు.

దళిత మహాసేన నేత రాజేశ్‌ను జైలుకు పంపిస్తారా? దళిత  కార్యకర్త భాగ్యలక్ష్మికి ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇలా అణగారిన వర్గాలను అణచివేస్తారా?’’ అని చంద్రబాబు నిలదీశారు.