నెల రోజుల పాటు గదిలో బంధించి అత్యాచారం... పోలీసులు లెక్కే చేయలేదు..
చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. వివాహితను నెల రోజుల పాటు రెండు చోట్ల నిర్భంధించి ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం బలిజపల్లికి చెందిన ఓ వివాహిత తిరుపతిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు.
బలిజపల్లికి చెందిన వ్యక్తి గత ఏడాది నవంబర్ 17న వివాహిత పనిచేస్తున్న పాఠశాలకు వెళ్లాడు. తనతో పాటు వస్తే బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని బలవంతం చేశాడు. ఆమె నిరాకరించింది. ఇంకా ప్రతిఘటించడంతో పాఠశాల ఆవరణలో బెదిరించి కొట్టి బలవంతంగా ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి.. గదిలో బంధించాడు.
ఐదు రోజులు పాటు నరకం చూపించాడు. నెల పాటు పాకాల మండలం, దామలచెరువులోనూ నిర్భంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను స్వగ్రామంలో విడిచిపెట్టాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందినా.. పోలీసులు పట్టించుకోలేదు. దీంతో దళిత సంఘాలు ఫైర్ అవుతున్నాయి.