సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (10:02 IST)

రైలు ప్రయాణిస్తూ బందరు కాల్వలో దూకిన మహిళ... ఎందుకు.. ఎక్కడ?

woman
రైలులో ప్రయాణిస్తూ వచ్చిన ఓ మహిళ ఆకస్మికంగా ఓ నీటి కాలువలో దూకేసింది. దీంతో ఆమె నీటి ప్రవాహంలో కొట్టుకునిపోతూ చివరకి ఓ చెట్టును పట్టుకుని రాత్రంతా అలానే గడిపింది. ఈ ఘటన విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే, ఈ మహిళ మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. 
 
బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు చెందిన ప్రైవేటు ఉద్యోగి షేక్ ఖాదర్ వలి భార్య, పిల్లలతో కలిసి నిజాంపట్నంలో ఉంటున్నారు. ఆయన భార్య జన్నతున్నీసా (47) కొన్నేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చిన ఆమె గుంటూరు జిల్లా నిడుబ్రోలులో విజయవాడ వైపు వెళ్లే రైలెక్కింది.
 
రాత్రి 11 గంటల సమయంలో రైలు విజయవాడ పూల మార్కెట్ పరిసరాలకు చేరుకుంది. అక్కడామె రైలు నుంచి కిందనున్న బందరు కాల్వలోకి దూకేసింది. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఓ చెట్టును పట్టుకుని రాత్రంతా అలాగే గడిపింది. ఉదయం స్థానికులు ఆమెను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి ఆమెను రక్షించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, ఆసుపత్రికి తరలించారు.