ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

నేటి నుంచి ట్రైన్ టిక్కెట్ బుకింగ్‌లో మార్పులు.. క్రెడిట్ కార్డులకు కొత్త నిబంధనలు...

train irctc
ఈ క్యాలెండర్ ఇయర్‌లో కొత్త నెల ప్రారంభమైంది. నవంబరు ఒకటో తేదీ నుంచి అనేక విషయాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా, నిత్యం ఉపయోగించే క్రెడిట్ కార్డులతో పాటు ట్రైన్ టిక్కెట్ ముందస్తు రిజర్వేషన్ విధానంలో కూడా మార్పులు తెచ్చింది. ఇవి నవంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అవేంటో ఓ సారి పరిశీలిద్ధాం.. 
 
టికెట్‌ రిజర్వేషన్లకు సంబంధించి భారతీయ రైల్వే కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. ప్రయాణానికి 120 రోజుల ముందుగానే బుకింగ్‌ చేసుకునే సదుపాయం ఉండగా.. దానిని 60 రోజులకు కుదించింది. ఈ నిబంధన నవంబరు ఒకటో తేదీ నుంచి ఐఆర్టీసీలో అమల్లోకి రానుంది. 
 
క్రెడిట్‌ కార్డుదారులకు ఐసీఐసీఐ బ్యాంక్‌ షాకిచ్చింది. వివిధ క్రెడిట్‌ కార్డులపై రివార్డు పాయింట్లు తగ్గించింది. గ్రాసరీ, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లో చేసే ఖర్చులు, లాంజ్‌ యాక్సెస్‌ రివార్డుపై దీని ప్రభావం పడనుంది. ఫ్యూయల్‌ కొనుగోలుపై విధించే సర్‌ఛార్జి రద్దు ఇకపై నెలకు రూ.50 వేల వరకు మాత్రమే వర్తిస్తుంది. థర్డ్‌ పార్టీ యాప్స్‌ సాయంతో చేసే ఎడ్యుకేషన్‌ ఫీజు చెల్లింపులపై 1 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నవంబరు 15 నుంచి ఈ కొత్త మార్పులు అమల్లోకి వస్తాయి.
 
భారతీయ స్టేట్ బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌ ఫైనాన్స్‌ ఛార్జీలను సవరించింది. నెలకు 3.50 శాతంగా ఉన్న మొత్తాన్ని నవంబరు 1 నుంచి 3.75 శాతానికి పెంచింది. శౌర్య, డిఫెన్స్‌ కార్డులను ఈ పెంపు నుంచి మినహాయించింది. అలాగే, ఒక బిల్లింగ్‌ సైకిల్‌లో చేసే యుటిలిటీ పేమెంట్లు (విద్యుత్‌, గ్యాస్‌) రూ.50 వేలు దాటితే ఒక శాతం సర్‌ఛార్జి వసూలు చేయనుంది. నవంబరు ఒకటో తేదీ నుంచే ఈ నిబంధన అమల్లోకి రానుంది. డిసెంబరు 1 నుంచి యుటిలిటీ బిల్లు మొత్తం రూ.50 వేలు దాటితే బిల్లు మొత్తానికి సర్‌ఛార్జి బ్యాంక్‌ వసూలు చేయనుంది.
 
భారత రిజర్వు బ్యాంకు ఒకటో తేదీ నుంచి దేశీయ నగదు బదిలీకి సంబంధించిన కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఆర్థిక చట్టాలకు ఫైనాన్షియల్‌ సంస్థలు లోబడి, దేశీయ నగదు బదిలీల భద్రతను పెంచేలా ఈ నిబంధనలను రూపొందించింది. బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ల లభ్యత, నగదు చెల్లింపుల వ్యవస్థ మెరుగుపరచడం, కేవైసీ నిబంధనలు సులభతరం చేయడం ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం.